బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. తీర ప్రాంత జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.
విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని. దీని ప్రభావంతో బుధవారం పశ్చిమమధ్య, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే 48 గంటల్లో మరింత బలపడే సూచనలు ఉన్నాయని ఆయన అన్నారు. దీని కారణంగా, రాబోయే రెండు రోజులు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వివరించారు.
Also Read..| తెలంగాణలో భారీ వర్షాలు .. ఆ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
బుధవారం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి వంటి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. గురువారం కూడా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
మరోవైపు, పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో ఇప్పటికే పరిస్థితి తీవ్రంగా ఉంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల వాగులు పొంగిపొర్లి, కొన్ని ఇళ్లు నీట మునిగాయి. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో పొంగిన వాగు కారణంగా పిడుగురాళ్ల-క్రోసూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అచ్చంపేట, అమరావతి మండలాల్లోనూ వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. జూలకల్లు సమీపంలో రహదారి తెగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.









