ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో జరిగిన ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్‌షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నం సహజ వనరులను, వ్యూహాత్మక ప్రాధాన్యతను ప్రస్తావించారు. విశాఖ ఒక అద్భుతమైన సాగర తీర నగరం అని, ఇది మంచి వనరులకు ఆలవాలమని సీఎం అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను, అత్యాధునిక సాంకేతికతలో ఏపీ సాధిస్తున్న ముందడుగును యూరప్ పారిశ్రామికవేత్తలకు వివరించారు. అమెరికా వెలుపల గూగుల్ తన అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్‌ను విశాఖలోనే ఏర్పాటు చేస్తోందనన్నారు. అలాగే సబ్-సీ కేబుల్ కూడా ఈ ప్రాంతం నుంచే ఏర్పాటు అవుతోందని వెల్లడించారు. గతంలో ఐటీని ప్రోత్సహించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. గూగుల్, అడోబ్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ స్థాయి సంస్థల సీఈఓలు భారతీయులే ఉండటం మన సామర్థ్యానికి నిదర్శనమని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంస్కరణల తరువాత పరిస్థితులు మారి, జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయన్నారు. వాటికి అనుగుణంగా సంపద పెరగాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఏపీలో వివిధ రకాల పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుందని చెబుతూ.. భారత్ క్వాంటం మిషన్ నేపథ్యంలో దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీని రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా, సివిల్ అప్లికేషన్లు, డిఫెన్స్ రంగాల్లో డ్రోన్ల తయారీని పెంచేందుకు రాష్ట్రంలో డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెరుగుతున్న అంతరిక్ష అప్లికేషన్ల కోసం స్పేస్ సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో రాష్ట్రం బలంగా ఉందని చంద్రబాబు తెలిపారు. గ్రీన్ ఎనర్జీకి పెరుగుతున్న ప్రాధాన్యతను గుర్తిస్తూ, సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని వివరించారు. భారత్ 500 గిగావాట్ల గ్రీన్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం పెట్టుకుంటే, అందులో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రయత్నిస్తోందని వివరించారు. పోర్టు రవాణా రంగానికి ప్రాధాన్యత ఇస్తూ పెద్దఎత్తున పోర్టులను నిర్మిస్తున్నామని, రైల్వే నెట్‌వర్క్ ద్వారా పోర్టులు, ఎయిర్‌పోర్టులు, దేశంలోని వివిధ నగరాలను సమర్థవంతంగా అనుసంధానం చేస్తున్నామని తెలిపారు.

పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విధానంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉందని సీఎం చెప్పారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనే విధానాన్ని అమలు చేస్తూ, యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నామని, కేవలం 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గూగుల్‌కు సైతం చాలా కొద్ది రోజుల్లోనే అనుమతులు ఇచ్చామని, వారు ఒకటి రెండు రోజుల్లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించబోతున్నారని తెలిపారు. ప్రోత్సాహకాలు, వేగంగా అనుమతులు ఇవ్వటంలో ఏపీకి పోటీ లేదని, పెట్టుబడులతో ముందుకు వచ్చే వారికి ఎస్కార్ట్ ఆఫీసర్‌ను నియమించి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా పూర్తిగా సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read..| రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
ప్రపంచ మార్కెట్‌కు గేట్‌వే ఏపీ : చంద్రబాబు
ప్రపంచ మార్కెట్‌కు గేట్‌వే ఏపీ ఉందని సీఎం ప్రకటించారు. పారిశ్రామిక ఉత్పత్తులు, విద్య, వైద్యం, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, యూరప్ దేశాల పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి సాటి లేదని అన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థాయి దేశంగా మారుతుందని, అందులో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.









