తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో, తిరుమలలో ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల కోసం భక్తులు భూదేవి కాంప్లెక్స్ వద్ద భారీగా బారులు తీరారు.
ప్రస్తుతం రోజుకు 11,900 సర్వ దర్శనం టోకెన్లు మాత్రమే అందుబాటులో ఉండగా, వీటి కోసం వేలాది మంది భక్తులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వచ్చే భక్తుల కోసం 2,250 టోకెన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
Also Read..| బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో 5 రోజులు భారీ వర్షాలు
శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఓపికగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. సెలవుల కారణంగా భక్తుల రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.









