తిరుపతిలో సింగయ్య మృతిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సింగయ్య మరణానికి జగన్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
సింగయ్య మృతికి జగనే కారణం: షర్మిల
తిరుపతిలో జగన్ కారు కిందపడి సింగయ్య మృతి చెందడంపై వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది స్పష్టంగా కనిపిస్తున్నా, ఈ వీడియోను ‘ఫేక్ వీడియో’ అని చెప్పడం హాస్యాస్పదమని ఆమె అన్నారు. కారు కింద మనిషి పడ్డాడన్న కనీస స్పృహ లేకుండా, కారులో ఉన్నవారు అలాగే ముందుకు పోవడం దారుణమని షర్మిల మండిపడ్డారు. ఇలాంటి ఘటన జరిగితే తప్పు ఒప్పుకోకుండా ‘ఫేక్’ అంటూ సమర్థించుకోవడం దుర్మార్గమని ఆమె అన్నారు. క్షమాపణ చెప్పకుండా ప్రజలను మభ్యపెట్టడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.
జగన్‌కు మానవత్వం లేదా?
జగన్‌కు మానవత్వం లేదని వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. మానవత్వం ఉంటే సింగయ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శ చేయలేదని ఆమె ప్రశ్నించారు. కనీసం 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల పరిహారం ఇచ్చి క్షమించమని అడగాలని డిమాండ్ చేశారు. సింగయ్యను ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదని, అతని పరిస్థితి ఎలా ఉందని ఎందుకు ఆరా తీయలేదని షర్మిల నిలదీశారు. బెట్టింగ్‌లో చనిపోయిన వ్యక్తికి విగ్రహం పెట్టడమే తప్పని, ఆ విగ్రహ ప్రారంభానికి ఇద్దరిని బలిస్తారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదేళ్ల కుంభకర్ణ నిద్ర తర్వాత ప్రజా సమస్యలు గుర్తుకొచ్చాయా?
జగన్ ఐదేళ్లు కుంభకర్ణ నిద్ర పోయి, ఇప్పుడు ప్రజా సమస్యలు అంటూ బయలుదేరడం విడ్డూరంగా ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ‘సిద్ధం’ అంటూ హడావిడి చేశారని, ఇప్పుడు ప్రతి చిన్న కార్యక్రమానికి బయటకు వెళ్తున్నారని విమర్శించారు. ఇవి ప్రజా సమస్యల మీద పోరాటాలు కావని, కేవలం బలప్రదర్శన, జన సమీకరణ కార్యక్రమాలు మాత్రమేనని షర్మిల తేల్చిచెప్పారు. “నాకు డబ్బుంది, బలం ఉంది” అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
జగన్ సభలకు అనుమతి ఇవ్వొద్దు.. కూటమి ప్రభుత్వానికి డిమాండ్
జగన్ పర్యటనకు కేవలం 5 వాహనాలకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, 50 వాహనాల్లో వెళ్లి, సైడ్ బోర్డు మీద నిలబడి షేక్ హ్యాండ్‌లు ఇవ్వడం తప్పు కాదా అని షర్మిల ప్రశ్నించారు. ప్రజలకు నమస్కారం పెట్టాలనుకుంటే సన్ రూఫ్ ఉన్న బండి ఎక్కి ప్రజలకు నమస్కారం పెడుతూ వెళ్ళాలని ఆమె సూచించారు. ఇది పక్కన పెట్టి జనాల మీద పడేలా సైడ్ బోర్డు మీద నిలబడటం తప్పు అని ఆమె అన్నారు. సింగయ్య మరణంపై విచారణ జరపాలని, కారులో ఉన్న అందరినీ విచారించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఇంకోసారి జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
Also Read..| రైతుకు భరోసా – రేవంతన్న : మంత్రి తుమ్మల
జగన్ జన సమీకరణ సభలకు అనుమతి ఇవ్వవద్దని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు. అనుమతి ఇచ్చి ప్రజలను చంపొద్దని ఆమె హితవు పలికారు. 100 మందికి అనుమతి ఇస్తే వెయ్యి మంది వస్తున్నా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్ ఏమి చేసినా చెల్లుబాటయ్యేలా ప్రభుత్వమే చూస్తోందని, జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టే అన్ని అనుమతులు ఇస్తున్నారని, ఆయనకు ఏమి ఆంక్షలు ఉండవని షర్మిల ఆరోపించారు. రాజకీయం అంటే ఇది కాదని, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గుర్తుకు రాని జగన్ ఇప్పుడు బయటకు రావడం విడ్డూరమని, ఐదేళ్ల పాటు పార్టీ కార్యకర్తలకు కూడా కనిపించలేదని షర్మిల అన్నారు.