తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి సంబరాల్లో మూడవ రోజు జరుపుకునే పండగే ‘కనుమ పండుగ‘ అత్యంత విశిష్టమైనది. భోగి మంటల వెచ్చదనం, సంక్రాంతి ముగ్గుల అందాల తర్వాత వచ్చే కనుమ పండగ అటు ప్రకృతికి, ఇటు మానవుడికి మధ్య ఉన్న విడదీయలేని అనుబంధాన్ని చాటిచెబుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లోని వారి జీవితాల్లో ఈ పండుగకు ప్రత్యేకమైన స్థానం ఉంది.

కనుమ పండుగ ప్రత్యేకత
వ్యవసాయం ప్రధాన వృత్తిగా గల మన దేశంలో, రైతుకు చేదోడు వాదోడుగా నిలిచేవి పశువులు. అందుకే కనుమను ‘పశువుల పండుగ’ అని కూడా పిలుస్తారు. ఏడాది పొడవునా పొలం పనుల్లో తనకు సహాయపడిన ఎడ్లకు, పాడిని అందించిన ఆవులకు, గేదెలకు కృతజ్ఞత చెప్పుకునే రోజే కనుమ. ఈ రోజున పశువులను చెరువులకు లేదా కాలువల వద్దకు తీసుకెళ్లి శుభ్రంగా కడిగి, వాటి కొమ్ములకు రంగులు పూస్తారు. పశువుల మెడలో గజ్జెలు, గంటలు కట్టి, నుదుట కుంకుమ బొట్లు పెట్టి భక్తితో పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో తప్పెట్లు, తాళాలతో పశువులను గ్రామంలో ఊరేగిస్తారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, మూగజీవాల పట్ల మనుషులు ప్రదర్శించే కృతజ్ఞతకు ప్రతీక.

కనుమ పండుగ రోజు ఉప్పు చెక్క తయారీ
కనుమ పండుగలో అత్యంత ఆసక్తికరమైన, వైజ్ఞానికమైన అంశం ‘ఉప్పుచెక్క’ తయారీ. పండుగ రోజు తెల్లవారకముందే గ్రామస్తులు అడవికి వెళ్లి వివిధ రకాల వనమూలికలను సేకరిస్తారు. మద్దిమాను, నేరేడు చెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు కాయ, నేలవేము వంటి అనేక ఔషధ మొక్కల భాగాలను సేకరించి ఇంటికి తీసుకవస్తారు. వీటిని చిన్న ముక్కలుగా కత్తిరించి, దానికి తగినంత ఉప్పు కలిపి రోట్లో వేసి మెత్తగా దంచుతారు. ఈ మిశ్రమాన్నే ‘ఉప్పుచెక్క’ అంటారు. ఇది ఘాటైన వాసన కలిగి ఉంటుంది. పశువులచేత దీనిని తినిపిస్తారు. ఈ ఉప్పుచెక్కలో ఉండే వనమూలికలు పశువుల పొట్టలోని పురుగులను చంపడమే కాకుండా, వాటిలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఏడాదికి ఒకసారి ఈ ఔషధాన్ని తినిపించడం వల్ల పశువులకు ‘సర్వరోగ నివారణి’గా పనిచేస్తుందని నమ్మకం. ఇది మన పూర్వీకులు అందించిన గొప్ప ఆయుర్వేద చికిత్సా విధానం అని కూడా అంటారు.

కనుమ పండుగలో అంతర్లీనంగా ఎన్నో సామాజిక అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి సమయంలో కొత్తగా ఇంటికి వచ్చిన ధాన్యం, కూరగాయలను దైవానికి నివేదించి, అందరూ కలిసి భోజనం చేస్తారు. నువ్వులు, జొన్నలు, సజ్జలు, బియ్యం వంటి ధాన్యాలతో చేసిన వంటకాలు తీసుకుంటారు. ఇవి శీతాకాలంలో శరీరానికి మేలు చేస్తాయి. బీరకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ, గుమ్మడికాయ వంటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే కూరగాయలను వాడతారు. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.
Also Read..| సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి ?
“కనుమ నాడు కాకి కూడా కదలదు” అనే సామెత ఉంది. అందుకే ఈ రోజున ఎవరూ ప్రయాణాలు పెట్టుకోరు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా గడపడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. అలాగే, కనుమ రోజున మినుము తినాలనే ఆచారం కూడా ఉంది. “కనుమ నాడు మినుము తినకపోతే గనుమ గా (కొండ చిలువ) పుడతారు” అని సరదాగా చెబుతుంటారు. మినుముతో చేసిన గారెలు ఈరోజు ప్రత్యేక వంటకంగా నిలుస్తాయి.
ముక్కనుమ వేడుకలు
కనుమ మరుసటి రోజును ‘ముక్కనుమ’ గా జరుపుకుంటారు. మాంసాహారం తినే వారు ఈ రోజును పెద్ద పండుగగా భావిస్తారు. మూడు రోజుల పండుగలో చివరి రోజైన ముక్కనుమతో సంక్రాంతి సంబరాలు ముగుస్తాయి. పల్లెల్లో కోడి పందాలు, ఎడ్ల పందాలు, గాలిపటాలు ఎగురవేయడం వంటి వినోద కార్యక్రమాలతో వాతావరణం సందడిగా మారుతుంది.
కనుమ పరమార్థం
కనుమ కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు. ఇది ప్రకృతి ఆరాధన, పశువుల పట్ల కృతజ్ఞత, ఆయుర్వేద విజ్ఞానం, కుటుంబ అనుబంధాల సమ్మేళనం. యాంత్రిక జీవనంలో పశువుల ప్రాధాన్యత తగ్గుతున్నప్పటికీ కనుమ వంటి పండుగలు మన మూలాలను, మన సంస్కృతిని గుర్తుచేస్తూనే ఉంటాయి. ప్రతి ఇల్లూ ఆనందాల లోగిలిగా మారి, మనుషుల మధ్య, ప్రకృతి మధ్య సామరస్యాన్ని పెంచడమే కనుమ పండుగ పరమార్థం.









