జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమర్థవంతమైన పన్ను వసూళ్ల ప్రక్రియ ద్వారా జాతీయ సంపదను పెంపొందించాలని, తద్వారా ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి అది ఉపకరించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర- రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశంలో ఈ అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ బాబు ఏ., కేంద్ర, రాష్ట్రాల జీఎస్టీ అధికారులు హాజరయ్యారు. డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పన్ను ఎగవేతలను సమర్థవంతంగా అడ్డుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
Also Read…| గ్లోబల్ కేపిటల్ ఆఫ్ ఏఐ గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు
జీఎస్టీ వసూళ్ల ప్రక్రియను మరింత పటిష్టం చేయడానికి, అన్ని శాఖల సమాచారాన్ని ఒకే చోట నిక్షిప్తం చేసేందుకు ‘డేటా లేక్’ ఏర్పాటు ఆవశ్యకతను చంద్రబాబు నొక్కి చెప్పారు. అంతేకాకుండా, జీఎస్టీ వసూళ్లకు సంబంధించి కేంద్ర-రాష్ట్రాల అధికారుల మధ్య నిరంతర సమాచార సమన్వయం ఉండాలని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రాల జీఎస్టీ వసూళ్ల పద్ధతులను విశ్లేషించి, వాటిలోని సానుకూల అంశాలను ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.









