ఆంధ్రప్రదేశ్దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి పై వేటుకు రంగం సిద్ధం అవుతోందని సమాచారం. దేవాదాయ శాఖలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన అసిస్టెంట్ కమిషనర్ కె. శాంతిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం చర్యలకు సిద్దమవుతోందని ప్రభుత్వవర్గాల నుండి తెలుస్తోంది. ఆమెపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని (కంపల్సరీ రిటైర్మెంట్) శాఖాపరంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకటి లేదా రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.
గత నెల 16న దేవదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు కె. శాంతి ఇటీవలే వివరణ ఇచ్చారు. అయితే, ఆమె ఇచ్చిన సమాధానాలు ఉన్నతాధికారులకు ఏ మాత్రం సంతృప్తినివ్వలేదని తెలుస్తోంది. ఆమెపై వచ్చిన ప్రధాన ఆరోపణల్లో.. రెండో వివాహం వ్యవహారంపై ఆమె ఇచ్చిన వివరణను అధికారులు తిరస్కరించారు. మొదటి భర్త ఎం. మదన్‌మోహన్‌తో చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండానే ఆమె పి. సుభాష్‌ను రెండో పెళ్లి చేసుకోవడం ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వెంట్ రూల్స్ (రూల్ 25) కు విరుద్ధమని దేవదాయ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మొదటి భర్తకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నందునే రెండో వివాహం చేసుకున్నానని ఆమె తన వివరణలో పేర్కొన్నప్పటికీ, ఈ వాదనను అధికారులు అంగీకరించలేదు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శాంతి విశాఖపట్నం జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌గా, అలాగే విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల దేవదాయ శాఖ అధికారిణిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో ఆమె నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, దేవాలయ భూముల పరిరక్షణలో విఫలమయ్యారని, ఆలయాలకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకున్నారని ఆమెపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే గత ఏడాది ఆగస్టులో ఆమెను సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు.
Also Read..| తెలంగాణలో హెలీ టూరిజం.. ఎక్కడో తెలుసా..?
తాజాగా, ఆమె సమర్పించిన వివరణ కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో, ఆమెను సర్వీస్ నుంచి తప్పనిసరిగా పదవీ విరమణ చేయించాలనే నిర్ణయానికి ఉన్నతాధికారులు వచ్చినట్లు సమాచారం. ఈ చర్యల ద్వారా దేవదాయ శాఖలో అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తారనే సందేశం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.









