Menu

  • Home
  • తెలంగాణ
  • తెలంగాణ‌లో హెలీ టూరిజం.. ఎక్క‌డో తెలుసా..?
Heli tourism coming soon in Telangana state

తెలంగాణ‌లో హెలీ టూరిజం.. ఎక్క‌డో తెలుసా..?

తెలంగాణలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, రాష్ట్ర ప్రభుత్వం హెలీ టూరిజం ను ప్రారంభించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ సరికొత్త పర్యాటక విధానం కింద, హైదరాబాద్ నుంచి సోమశిల మీదుగా శ్రీశైలం వరకు హెలికాప్టర్ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతిపాదనలను ‘ఈజ్ మై ట్రిప్’ సంస్థతో కలిసి రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు.

హెలీ టూరిజం ద్వారా పర్యాటకానికి కొత్త ఊపు

తెలంగాణలో పర్యాటక రంగానికి మరింత ఊపునిచ్చేందుకు హెలీ టూరిజం తొలి అడుగుగా భావిస్తున్నారు. ఈ సేవలు పర్యాటకులకు గగనతలంలో అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి. హైదరాబాద్, సోమశిల, శ్రీశైలం మధ్య ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. దీని ద్వారా రాష్ట్ర పర్యాటక రంగం కొత్త శిఖరాలకు చేరుకుంటుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని మంత్రి పేర్కొన్నారు.

హెలీ టూరిజం తో పాటు వెల్‌నెస్‌ & స్పిరిచ్యువల్‌ రిట్రీట్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన

హెలీ టూరిజంతో పాటు, తెలంగాణ పర్యాటక శాఖ పలు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను కూడా చేపట్టింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో రూ. 68.10 కోట్ల అంచనా వ్యయంతో సోమశిల, నల్లమల, అమరగిరి, ఈగలపెంట ప్రాంతాల్లో వెల్‌నెస్‌ & స్పిరిచ్యువల్‌ రిట్రీట్‌ ప్రాజెక్టులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు.

Heli tourism coming in Telangana

అమరగిరి ఐలాండ్ వెల్‌నెస్‌ రిట్రీట్‌ (రూ. 45.84 కోట్లు): ఈ ప్రాజెక్ట్‌లో యోగా డెక్, స్పా ఏరియా, కాటేజీలు, స్విమ్మింగ్ పూల్, ఇండోర్, ఔట్‌డోర్ కార్యకలాపాలు, వీక్షణ వేదిక, జెట్టీ, ధ్యానాలయం, గార్డెనింగ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి. సోమశిల విఐపి ఘాట్ వ‌ద్ద‌ బోటింగ్ పాయింట్ కోసం ట్రెంచింగ్ పనులు చేపట్టనున్నారు.

Heli tourism soon in Telangana

ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఒక సంవత్సరంలోగా ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. కొత్త ప్రాజెక్టులు పూర్తయితే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని, రాష్ట్ర ఆదాయం, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పర్యాటకాభివృద్ధికి ప్రాధాన్యత

గత పదేళ్లలో పర్యాటక రంగం నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అన్నారు. స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు మౌలిక వసతులను మెరుగుపరచడమే కాకుండా, విస్తృత ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ టూరిజంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. సోమశిల-సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.

Heli tourism in Telangana soon

పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యాటకాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, తెలంగాణను పర్యాటక రంగంలో అగ్రస్థానంలో నిలపడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. నల్లమల సర్క్యూట్ అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Share the post