ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. (T. Harish Rao) ఈ కేసు విచారణలో భాగంగా నేడు సిట్ ముందుకు హరీష్ రావు (Special Investigation Team) హాజరుకానున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతలు, అధికారులు, వ్యాపారవేత్తల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీస్ అధికారులు, ఇతర నిందితులను విచారించిన సిట్, ఇప్పుడు కీలక నేతల పాత్రపై దృష్టి సారించింది.
ఫోన్ టాపింగ్ వ్యవహారంపై నమోదైన కేసు విచారణ క్రమంగా ముందుకు సాగుతోంది. దర్యాప్తులో భాగంగా లభించిన సమాచారం, ఇతర నిందితుల వాంగ్మూలాల ఆధారంగా హరీష్ రావును ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సిట్ భావించినట్లు సమాచారం. దీంతో హరీష్ రావుకు సెక్షన్ 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. సాక్షిగా జనవరి 20వ తేదీన ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కన్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు నేడు సిట్ ఎదుట హాజరు కానున్నారు.
ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, 2024 మార్చి 10న పంజాగుట్టలో కేసు నమోదు అయింది. గత ప్రభుత్వ కాలంలో ప్రత్యేక నిఘా పేరుతో పెద్ద ఎత్తున ఫోన్ టాపింగ్ జరిగిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. రాజకీయ ప్రత్యర్థులు, అంతర్గత విభేదాలు ఉన్న నేతలు, అలాగే కొంతమంది మీడియా ప్రతినిధుల ఫోన్లు కూడా నిఘాలో ఉన్నాయన్న అంశాలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికార మార్పు తర్వాత ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి, సిట్ ఏర్పాటు చేసి లోతైన విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా, హరీష్ రావు ఈ ఆరోపణలను మొదటి నుంచే ఖండిస్తున్నారు. ఫోన్ టాపింగ్ వంటి అక్రమాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ కక్ష సాధింపు కోసమే తన పేరును లాగుతున్నారని ఆయన పలుమార్లు వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, సిట్‌కు సహకరిస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు.
Also Read..| మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం
సిట్ హరీష్ రావు నుంచి ఏ స్థాయి సమాచారం సేకరిస్తుందన్నది, తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తు ఎటు దారి తీస్తుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.









