Menu

  • Home
  • తెలంగాణ
  • సిట్ నోటీసులు రాజకీయ కక్షే : హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
Image

సిట్ నోటీసులు రాజకీయ కక్షే : హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోకాపేట నివాసం వద్ద నుంచి సిట్ విచారణకు బయల్దేరేముందు ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తాను నోటీసులు అందుకున్న వెంటనే సిద్దిపేట నుంచి హైదరాబాద్ వచ్చి సిట్ విచారణకు హాజరవుతున్నానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తన బామ్మర్ది వ్యవహారాన్ని నేను ఉదయం బయటపెడితే, అదే రోజు సాయంత్రం నాకు నోటీసులు ఇవ్వడం న రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగమేనని ఆయన విమర్శించారు. తాను సిద్దిపేటలో ఉన్నప్పటికీ రాత్రివేళ ఇంటి వద్ద నోటీసులు ఇచ్చి వెళ్లడం ద్వారా భయపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే తాటాకు చప్పుళ్లకు తాను భయపడబోనని, గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో కేసులు, నిర్బంధాలు ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. తాము ఉద్యమకారులమని, కేసీఆర్ తయారు చేసిన సైనికులమని, ఇలాంటి పిట్ట బెదిరింపులకు బయటపడే ప్రసక్తే లేదన్నారు. బొగ్గు స్కాం, పవర్ స్కాం, హిల్ టీపీ, భూ కుంభకోణాల వంటి అంశాలను బయటపెడితే ఒక్క మంత్రి కానీ, ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ స్పందించలేదని ఎద్దేవా చేశారు. దండుపాళ్యం ముటా వాటాలు పంచుకునే తీరును ప్రజల ముందుంచిన తర్వాతే ఈ నోటీసుల డ్రామా మొదలైందన్నారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల ముందు అవినీతి బండారం బయటపడితే కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారని హరీశ్ రావు ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ అంచనాలు తలకిందులయ్యాయని, బీఆర్ఎస్ 40 శాతం స్థానాలు గెలుచుకుని విజయాన్ని సాధించిందన్నారు. అదే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో అయినా లాభం పొందాలనే ఆశతో కేసులు, విచారణల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్‌పై, మున్సిపల్ ఎన్నికల ముందు తనపై నోటీసులు ఇచ్చిన చరిత్రను గుర్తు చేశారు.

ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని, మహిళలకు మహాలక్ష్మి పథకం ఏమైందని, అవ్వాతాతలకు రూ.4 వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావని ప్రశ్నించడమే తమ తప్పా అని నిలదీశారు. కృష్ణా, గోదావరి నీళ్లను ఏపీకి అప్పనంగా కట్టబెడుతూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని, అలాంటి అంశాలపై అసెంబ్లీ లోపల, వెలుపల నిలదీసినందుకే తమపై కక్ష పెంచుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఒత్తిడిని రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని, ప్రజల్లో తన వాటాల విషయం అర్థమైపోయిందనే భయంతోనే డైవర్షన్లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

గతంలో తనపై ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టినప్పుడు సుప్రీం కోర్టు చెంపచెల్లుమనే తీర్పు ఇచ్చిందని, హైకోర్టులో కూడా న్యాయం తమవైపే నిలిచిందని గుర్తు చేశారు. రెండేళ్లుగా ఇదే డ్రామాను ఎన్ని రోజులు కొనసాగిస్తావని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఇది కేవలం బురదజల్లే రాజకీయ నాటకమేనని స్పష్టం చేశారు. ఎన్ని సార్లు పిలిచినా విచారణలకు హాజరవుతామని, ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమేనని చెప్పారు.

Also Read..| ఫోన్ టాపింగ్ కేసులో సంచలనం.. సిట్ ముందుకు హరీష్ రావు

బొగ్గు స్కాం విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కైపోయాయన్న ఆరోపణ నిజం కాకపోతే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తన బామ్మర్దితో కలిసి చేసిన స్కాంలపై సమగ్ర విచారణ జరగాలని, నైనీ బ్లాక్ ఒక్కటే కాకుండా అన్ని టెండర్లు రద్దు చేసి సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దొంగలను అరెస్టు చేసి అవినీతి సొమ్మును కక్కించాలన్నారు.

సింగరేణి డబ్బులతో రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ఆడుతున్నాడని, అటువంటి అంశాలపై కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. దావోస్ నుంచి రేవంత్ రెడ్డి వచ్చే వరకూ మూడు రోజుల ముందే ప్లాన్ వేసి ఈ సీరియల్ నడుపుతున్నారని ఆరోపించారు. ఎన్ని డైవర్షన్లు చేసినా మీ అవినీతి కుంభకోణాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని, తెలంగాణ ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని హరీశ్ రావు హెచ్చరించారు. న్యాయపరంగా అన్ని విధాలా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు.

Share the post