తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు. రాష్ట్రంలోని రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై ఘాటుగా స్పందించిన ఆయన, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీరును తీవ్రంగా తప్పుబట్టారు. రైతుల పక్షాన తాను రాసిన లేఖకు సమాధానం ఇవ్వకుండా, ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆయన లేఖలోని ముఖ్యాంశాలు ఇవే:
బండి సంజయ్ లేఖలో తుమ్మలపై ధ్వజం
వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అబద్ధాలు చెప్పడంలో, అవగాహన రాహిత్యంలో ‘ఆస్కార్’ అవార్డుకు అర్హులని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎంఎస్పీ (MSP) చట్టం తెస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, ఆ విషయం కూడా తెలియకుండా మంత్రి మాట్లాడటం ఆయన అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. మద్దతు ధర నిర్ణయాధికారం కేంద్రానిది అయితే, దానిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్న కనీస సోయి మంత్రికి లేకపోవడం విచారకరమన్నారు.
బండి సంజయ్ లేఖలో రుణమాఫీ, పంట బీమాపై ప్రశ్నలు
రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని ప్రభుత్వం స్వయంగా ఒప్పుకుందని, మరి మిగిలిన వారికి ఎప్పుడు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఫసల్ బీమా యోజన’ పథకాన్ని బీజేపీయేతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని గుర్తు చేస్తూ.. గత రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంట బీమా పథకాన్ని ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకోవడంలో రాష్ట్రం విఫలమైందని, ఎకరాకు 10 వేల రూపాయలు ఇస్తామని చెప్పి, కేవలం స్వల్ప నిధులతో చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వాటా
రాష్ట్రంలో పండే ధాన్యంలో కేంద్రం కేవలం 25 శాతం మాత్రమే కొంటోందన్న వాదన పచ్చి అబద్ధమని బండి సంజయ్ కొట్టిపారేశారు. గత ఖరీఫ్, రబీ సీజన్లలో రాష్ట్రం సేకరించిన ధాన్యంలో సింహభాగం కేంద్రమే కొనుగోలు చేసిందని గణాంకాలతో వివరించారు.
- గత ఖరీఫ్: 71.86 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 60 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం కొన్నది.
- గత రబీ: 74.22 లక్షల మెట్రిక్ టన్నులలో 50.10 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రమే తీసుకుంది.
- ప్రస్తుత సీజన్లో కూడా గత రబీ కంటే 2 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా సేకరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
కేంద్ర నిధుల లెక్కలు
గడిచిన 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఇచ్చిందని బండి సంజయ్ తెలిపారు. సుతిలీతాడు, గోనె సంచుల దగ్గర నుండి వడ్ల కొనుగోలుకు అయ్యే ప్రతి పైసా కేంద్రమే చెల్లిస్తోందన్నారు. ఎస్డీఆర్ఎఫ్ (SDRF) కింద కేంద్రం ఏటా ఇచ్చే 400 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్ లేఖలో రేవంత్ రెడ్డికి విన్నపం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని, తన మంత్రికి కాంగ్రెస్ మేనిఫెస్టోపై, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై అవగాహన కల్పించాలని బండి సంజయ్ సూచించారు. రాజకీయ నిందారోపణలు మాని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. రబీ సీజన్లో పండే అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లించాలని, మేనిఫెస్టోలో ఇచ్చిన రైతు హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.









