Menu

  • Home
  • తెలంగాణ
  • రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బ‌కాయిలు విడుద‌ల చేయాలిః బీజేపీ
Pending dues of retired employees should be released.

రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బ‌కాయిలు విడుద‌ల చేయాలిః బీజేపీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బ‌కాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. బిజెపి ఎమ్మెల్సీల నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.

పెండింగ్ బ‌కాయిలు విడుద‌లలో ప్రభుత్వం విఫలం

ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీళ్లు-నిధులు-నియామకాల నినాదంతో సాకారమైన తెలంగాణలో, నేడు రిటైర్డ్ ఉద్యోగులు తమ సొంత డబ్బుల‌ కోసం రోడ్డెక్కడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రిటైర్మెంట్ రోజునే అన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి మోసం చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పీఆర్సీ, డీఏలు, గ్రాట్యూటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి అన్ని రకాల చెల్లింపులను నిలిపివేసిందని విమర్శించారు.

Pending dues of retired employees

రాష్ట్రంలో దాదాపు రూ. 2,000 కోట్లకు పైగా రిటైర్మెంట్ ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఐదు డీఏలు బకాయి ఉండటం గమనార్హమని రాంచందర్ రావు పేర్కొన్నారు. “నెలకు రూ. 700 కోట్లు విడుదల చేసి ఏడాదిలో బిల్లులన్నీ క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ నీటి మూటగా మారింది” అని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల, మనస్తాపంతో సుమారు 40 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు మరణించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు.

Pending dues of retired employees should be released bjp demand

కేవలం రిటైర్డ్ ఉద్యోగులే కాకుండా, నిరుద్యోగుల, విశ్వవిద్యాలయ ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేతలు గుర్తు చేశారు. నిరుద్యోగ భృతి హామీని విస్మరించడం, టీజీపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు, ఓయూకు నిధుల కేటాయింపులో జాప్యం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. నిధులు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు తమ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం బీజేపీ ఈ ‘ధర్మయుద్ధాన్ని’ కొనసాగిస్తుందని, అసెంబ్లీ, కౌన్సిల్‌లోనూ నిరంతరం ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Share the post