నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్ భేటీకి ఒక ప్రత్యేకత ఉంది. ఇది హైదరాబాద్‌కు బయట నిర్వస్తున్న తొలి కేబినెట్ సమావేశంగా నిలవనుంది. ములుగు జిల్లా మేడారం వనదేవతలు కొలువు దీరిన అటవీ ప్రాంతంలో ఈ సమావేశం జరగనుండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సమ్మక్క–సారలమ్మ జాతరకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం లక్ష్యంగా మేడారాన్ని వేదికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలనే అంశంపై కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే గిరిజన సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ సమావేశంలో రైతులకు సంబంధించిన పలు పథకాలు, ముఖ్యంగా రైతు భరోసా, పంటల మద్దతు ధర, నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరగనుంది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశం, ఉద్యోగాల భర్తీ వంటి కీలక విషయాలు కూడా కేబినెట్ అజెండాలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్ అమలుపై కూడా మంత్రులు చర్చించనున్నారు.
Also Read..| కనుమ పండుగ ప్రత్యేకత ఏమిటి?
కేబినెట్ సమావేశం నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఉన్నతాధికారుల రాకతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సమావేశం ద్వారా ప్రజలకు దగ్గరగా పాలన సాగిస్తామనే సంకేతాన్ని ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తోంది. మొత్తం మీద నేటి కేబినెట్ భేటీ తెలంగాణ పాలనలో ఒక కీలక మైలురాయిగా నిలిచే అవకాశం కనబడుతోంది.









