Menu

  • Home
  • తెలంగాణ
  • తెలంగాణలో భారీ వర్షాలు .. ఆ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
Heavy rains in Telangana

తెలంగాణలో భారీ వర్షాలు .. ఆ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ జారీ చేసిన రెడ్ అలర్ట్ నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎం, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న 72 గంటలు చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేశారు.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, పశ్చిమ-మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, హనుమకొండ, జనగామ, వరంగల్ జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అంతేకాకుండా, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, హైదరాబాద్ వంటి తొమ్మిది జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’, మంచిర్యాల, జగిత్యాల వంటి ఐదు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాండూరులో రైల్వే అండర్ బ్రిడ్జ్ నీట మునిగింది, వాగులు, వంకలు పొంగి పొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

Heavy rains in Telangana districts

ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా, వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి హెలికాప్టర్లను సిద్ధం చేయాలని, అవసరమైతే ఎయిర్ లిఫ్టింగ్ చేయాలని సూచించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో నిరంతరం సమన్వయం చేసుకోవాలని తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లను అందుబాటులో ఉంచాలని, అత్యవసర సమయాల్లో వినియోగించుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని తెలిపారు.

Also Read..| తెలంగాణ సీఎస్ ప‌ద‌వీకాలాన్ని ప్ర‌భుత్వం పొడిగించేనా..?

విద్యా సంస్థలు, ఐటీ రంగంపైనా దృష్టి సారించారు. భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించే అధికారం సంబంధిత అధికారులకు కల్పించారు. పరిస్థితిని బట్టి ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని అన్నారు. అంతేకాకుండా, అత్యవసర ఫిర్యాదుల కోసం ఒక టోల్-ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని, ప్రతి కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేయాలని ఆదేశించారు. గతంలో ఖమ్మంలో 2 గంటల్లో 42 సెం.మీ వర్షం పడిన విషయాన్ని గుర్తుచేశారు. క్లౌడ్ బరస్ట్ వంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని అధికారులకు తెలిపారు. ఎఫ్ఎం రేడియోల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించాలని అన్నారు. రాబోయే మూడు రోజులు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సమన్వయంతో, అప్రమత్తంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Share the post

Also Read..