Menu

  • Home
  • తెలంగాణ
  • తెలంగాణ సీఎస్ ప‌ద‌వీకాలాన్ని ప్ర‌భుత్వం పొడిగించేనా..?
Telangana CS Ramakrishna Rao

తెలంగాణ సీఎస్ ప‌ద‌వీకాలాన్ని ప్ర‌భుత్వం పొడిగించేనా..?

తెలంగాణ సీఎస్ ( ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శి ) పదవికి కొత్త వ్యక్తిని ఎంపిక చేసే ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుత సీఎస్‌ కే. రామకృష్ణారావు ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తారా.. లేక కొత్త అధికారిని నియమిస్తారా అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.

రామకృష్ణారావు ఏప్రిల్ 30, 2025న సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో కనీసం రెండేళ్లు పదవిలో ఉండే అధికారిని నియమిస్తే పాలనపై తమదైన ముద్ర వేయడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి రామకృష్ణారావును సీఎస్‌గా నియమించారని అధికార వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు, కొత్త ప్రభుత్వం కీలక విధానాలను అమలు చేయాల్సిన సమయంలో, కొత్త సీఎస్‌ నియామకంపై మరింత ఆసక్తి నెలకొంది.

సీఎస్ రేసులో పలువురు సీనియర్ అధికారులు ఉన్నప్పటికీ, 1992 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు అధికారులు ముందు వరుసలో ఉన్నారు. వారిలో సంజయ్ జాజు, జయేశ్ రంజన్, వికాస్ రాజ్ ఉన్నారు. సంజయ్ జాజు ప్రస్తుతం కేంద్ర సర్వీసులలో పనిచేస్తున్నారు. ఆయన రాష్ట్రానికి తిరిగి రావాలని ఆసక్తి చూపిస్తే, సీఎస్‌ పదవికి బలమైన పోటీదారుగా మారే అవకాశం ఉంది. ఆయనకు ఇంకా ఐదు సంవత్సరాల సర్వీస్ ఉండటం ఒక సానుకూల అంశం. అయితే, ఆయన కేంద్రంలో కొనసాగితే క్యాబినెట్ సెక్రటరీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంజయ్ జాజు నిర్ణయం కీలకంగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Telangana CS

1990 బ్యాచ్‌కు చెందిన శశాంక్ గోయల్, 1991 బ్యాచ్‌కు చెందిన అరవింద్ కుమార్ కూడా సీనియర్ అధికారులే.. అయినప్పటికీ, వారిపేరు సీఎస్ రేసులో పెద్దగా వినిపించడం లేదు. అరవింద్ కుమార్ ఫార్ములా-ఈ రేస్ కేసులో విచారణ ఎదుర్కొంటుండటంతో, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను కీలక పదవుల నుంచి తప్పించింది. శశాంక్ గోయల్ విషయంలోనూ రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఆయన ఢిల్లీలో ఉండేందుకు మొగ్గు చూపుతుండటంతో, ప్రస్తుతం ఆయన‌ను ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించారు. దీంతో ఈ ఇద్దరు అధికారులు సీఎస్ పదవిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదనే చ‌ర్చ జ‌రుగుతోంది.

రాష్ట్రంలో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న జయేశ్ రంజన్, వికాస్ రాజ్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో ఉన్నారు. జయేశ్ రంజన్ తెలివైన అధికారిగా, పెట్టుబడులు ఆకర్షించడంలో నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి వివాదాలు లేకపోవడం ఆయనకు ఉన్న మరో సానుకూల అంశం. వికాస్ రాజ్ గ‌త అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో ఎల‌క్ష‌న్ కమిషనర్‌గా పనిచేసి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరిలో ఎవరిని సీఎస్‌గా నియమిస్తే రాష్ట్రానికి ఎక్కువ ఉప‌యోగంగా ఉంటుంద‌నే అంశం ఆధారంగా నిర్ణయం ఉండే అవ‌కాశం క‌నిపిస్తింది . రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం, ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

Also Read..| కాళేశ్వ‌రం క‌మీషన్ రిపోర్టు ను ప్ర‌భుత్వానికి అందించిన ఘోష్

రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ కోణంలో చూస్తే, బీసీ సామాజిక వర్గానికి చెందిన జయేశ్ రంజన్‌ను సీఎస్‌గా నియమిస్తే రాజకీయంగా తమకు కూడా ప్రయోజనం ఉంటుందని ప్ర‌భుత్వ‌ వర్గాలు భావిస్తున్నాయనే టాక్ న‌డుస్తోంది . ఆయన పదవీకాలం 2027 సెప్టెంబర్ వరకు ఉండటం కూడా ఒక సానుకూల అంశంగా భావిస్తున్నార‌ట‌. సీఎస్ నియామకంలో రాజకీయ కోణాన్ని కూడా విస్మరించలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పదవీకాలం పొడిగింపు కోసం ప్రస్తుత సీఎస్‌ రామకృష్ణారావు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే, పొడిగింపునకు అవకాశం ఉందా లేదా అనే అంశంపై సచివాలయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండదండలు రామకృష్ణారావుకు ఉన్నాయని, ఆయ‌న ప‌ద‌విని పొడిగిస్తార‌ని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, తెలంగాణ తొలి సీఎస్‌ రాజీవ్ శర్మకు కేసీఆర్ రెండుసార్లు పొడిగింపు ఇచ్చినప్పటికీ, ప్రదీప్ చంద్ర విషయంలో కేంద్రం నుంచి ఆమోదం పొందడంలో విఫలమయ్యారని కొంద‌రు అధికారులు గుర్తు చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే, రామకృష్ణారావు పొడిగింపునకు కేంద్రానికి లేఖ రాయడం మాత్రమే సరిపోదని, ముఖ్యమంత్రి స్వయంగా ప్రధానితో మాట్లాడి ఒప్పించుకుంటేనే పని పూర్తవుతుందని మ‌రికొంద‌రు అంటున్నారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త సీఎస్‌ను నియమించుకుంటుందా లేక రామకృష్ణారావు పదవీకాలాన్ని పొడిగిస్తుందా అనేది తెలియాలంటే మ‌రికొన్నిరోజులు వేచి చూడాల్సిందే.

Share the post

Also Read..