నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించిన కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించడం వల్లే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో మీ ముందు నిలబడ్డానని భావోద్వేగంతో మాట్లాడారు. కొడంగల్‌ను దేశంలోనే ఒక ఆదర్శవంతమైన ‘మోడల్’ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, చదువుకున్న యువతకు ఉపాధి కల్పించేందుకు ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఇప్పుడు పార్టీలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని సర్పంచులకు పిలుపునిచ్చారు.
సర్పంచులకు భారీ నజరానా..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,706 మంది సర్పంచులకు శుభవార్త చెబుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ప్రకటించారు. చిన్న గ్రామ పంచాయతీలకు రూ. 5 లక్షలు, మేజర్ పంచాయతీలకు రూ. 10 లక్షల చొప్పున ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి (SDF) నుంచి నేరుగా విడుదల చేస్తామని వెల్లడించారు. ఇది కేంద్ర, రాష్ట్ర నిధులకు అదనమని స్పష్టం చేశారు. అలాగే, తమ ప్రభుత్వం 9 నెలల్లోనే రూ. 9 వేల కోట్ల రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేసిందని గుర్తుచేశారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూసే బాధ్యత సర్పంచులదేనని సీఎం సూచించారు.
కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నిప్పులు చెరిగారు. “తోలు తీస్తా” అని మాట్లాడుతున్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు సర్పంచులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. పదేళ్ల పాలనలో పాలమూరును పడావు పెట్టి, కేవలం ఆస్తులు కూడబెట్టుకున్నారని విమర్శించారు. “మేం కక్ష సాదింపు రాజకీయాలు చేయం కాబట్టే ఊరుకున్నాం.. కానీ మా జోలికి వస్తే మా కార్యకర్తలు ఊరుకోరు” అని హెచ్చరించారు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ప్రస్తావిస్తూ, సొంత చెల్లెలి భర్త ఫోన్ ట్యాపింగ్ చేసిన చరిత్ర మీదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం, కృష్ణా జలాలు, ఫోన్ ట్యాపింగ్‌పై చర్చించాలని ఆయన సవాల్ విసిరారు.
2029 ఎన్నికలపై సవాల్
వచ్చే ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వేదికగా భారీ శపథం చేశారు. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 87 నుండి 100 పైగా స్థానాలతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, బిఆర్ఎస్ చరిత్ర ఇక ముగిసిపోయిందని, తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ అధికారంలోకి రావడం కల్ల అని సవాల్ విసిరారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ముఖ్యంగా పిల్లలను బాగా చదివించాలని కోరుతూ, వచ్చే అకడమిక్ ఇయర్ నుండి పాఠశాలల్లో అల్పాహారం, భోజనం తానే దగ్గరుండి అందిస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
Also Read..| మేడారం జాతర 2026 పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి









