ఆంధ్రప్రదేశ్ లోని విజయ నగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి ఏడు గంటలకు విశాఖ- రాయఘడ్ ప్యాసింజర్ రైలు.. ఆగి ఉన్న విశాఖ- పలాస ప్యాసింజర్ రైలును వేగంగా వచ్చి ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా పక్క ట్రాక్‌లోని గూడ్స్ రైలు పైకి దూసుకెళ్లింది. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. రెండు రైళ్లలో 1400 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 7 భోగీలు నుజ్జు నుజ్జయ్యాయి. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. రెస్క్యూ టీంలు సహాయక చర్యలు చేపట్టాయి. క్రేన్ల సాయంతో భోగీలను తొలగిస్తున్నారు. క్షతగాత్రులలకు మెరుగైన చికిత్స అందించచాలని సీఎం జగన్ ఆదేశించారు. రైలు ప్రమాద ఘటనా స్ధలానికి సీఎం జగన్ వెళ్లనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాదితులను సీఎం పరామర్శిస్తారు. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 లక్షల పరిహారం ప్రకటించింది. రైలు ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేసి, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.