ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-జనసేన కూటమి ఈసారి అధికారం దక్కించు కునేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రెండు పార్టీలు కలిసి ఏపి రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నాయి. ఇవాళ విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ కీలక భేటీ కాబోతుంది.
ఈ సమావేశానికి టీడీపీ నుంచి ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య పాల్గొనగా.. జనసేన తరఫున నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, బొమ్మిడి నాయకర్, గోవిందరావు, యశస్విని హాజరు కాబోతున్నారు.
క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే, జిల్లాల్లో ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ పైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
అయితే, టీడీపీ-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ సీట్ల సర్దుబాటుపై ఇప్పటి వరకు ఏకాభిప్రాయానికి రాలేదు. పొత్తును ముందుకు తీసుకెళతాం అని టీడీపీ, జనసేన అగ్ర నేతలు చెప్తున్నారు.. కానీ, ఇరు పార్టీల నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల్లో ప్రస్తుతం గందరగోళం నెలకొంది.