ఎన్నికల అనంతరం పల్నాడు, అనంతపురం, తిరుపతిలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని భారత ఎన్నికల సంఘం (ECI) ఆదేశించింది. సిట్ శనివారం ఆయా ప్రాంతాలలో విచారణను ప్రారంభించింది.
ఏసీబీ ఎస్పీ రమాదేవి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు సహా 13 మంది సభ్యులతో కూడిన సిట్ వివిధ ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేసేందుకు నాలుగు బృందాలుగా విడిపోయింది. మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలో అల్లర్లు, కాల్పులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లను వారు పరిశీలించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం (SPMVV)లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలను ఒక బృందం పరిశీలించింది. సిట్ CCTV ఫుటేజీ, మీడియా రికార్డింగ్‌ల వంటి సాక్ష్యాలను సేకరించింది. దర్యాప్తు అనంతరం నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని.. సమగ్ర నివేదిక ఈసీకి సమర్పించాలని డీజీపీ సిట్‌ను ఆదేశించారు.