ఆంధ్రప్రదేశ్‌ను పర్యావరణ హిత రాష్ట్రంగా మార్చి, అక్టోబర్ 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు తయారు చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని పూర్తిగా నిర్మూలించి, ప్లాస్టిక్ రహిత నగరాలను తీర్చిదిద్దాలని ఆయన సంకల్పించారు. ఈ మేరకు అక్టోబర్ 2వ తేదీ నాటికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రితో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచుల వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
ప్లాస్టిక్ రహిత నగరాలు కావడానికి పటిష్ట కార్యాచరణ
మంగళవారం జరిగిన సర్క్యులర్ ఎకానమీ సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 87 పట్టణ ప్రాంతాల్లో 157 ‘రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్ (RRR)’ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలని, రీసైక్లింగ్ మరియు చెత్త వేరుచేసే ప్రక్రియపై 90 రోజుల్లోగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
Also Read..|తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్రమంత్రి జయంత్ చౌదరి భేటీ
‘స్వచ్ఛత’ అవార్డులతో ప్లాస్టిక్ రహిత నగరాలు ప్రోత్సాహం
వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని ప్రోత్సహించడానికి వచ్చే ఏడాది అక్టోబర్ 2 నుంచి ‘స్వచ్ఛత’ అవార్డులను అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. స్థానిక సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, అంగన్‌వాడీలు, పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, ఆసుపత్రులు, ఎన్జీవోలు, ఇతర సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.

సర్క్యులర్ ఎకానమీకి అధిక ప్రాధాన్యత
వ్యర్థాలను సంపదగా మార్చే లక్ష్యంతో, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రెండు నెలల్లోగా సర్క్యులర్ ఎకానమీ తుది పాలసీని తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. ఈ ప్రణాళికలో భాగంగా, ఏడాదిలోగా రాష్ట్రంలో మూడు సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశలో విశాఖపట్నంలో 400 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక పార్కును నిర్మిస్తారు. ఇందుకోసం విజయవంతమైన అంతర్జాతీయ నమూనాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ పార్కుల ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించాలని, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమర్పించిన ‘సర్క్యులర్ ఎకానమీ పార్కుల’ ఏర్పాటు ప్రతిపాదనలను కూడా సీఎం పరిశీలించారు.

అదనపు శాఖలపై దృష్టి
సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన మున్సిపల్, వాహనాలు, లిథియం బ్యాటరీలు, జిప్సం, టైర్లు, రబ్బర్, ఎలక్ట్రానిక్, వ్యవసాయం, పారిశ్రామిక, ఆక్వా వ్యర్థాలు వంటి 11 రంగాలపై ప్రధానంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. వీటికి అదనంగా గనులు, చేనేత, పశుసంవర్ధక శాఖలను కూడా కలుపుకుని సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. నగర పాలక సంస్థలు, పంచాయతీల్లో ‘జీరో వేస్ట్’ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలని ఆయన ఉద్ఘాటించారు.
వ్యర్ధ పదార్ధాల నుంచి సంపద సృష్టించడం ద్వారా ‘‘సర్క్యులర్ ఎకానమీ’’ అభివృద్ధి చేసే అంశంపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ‘మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ సిద్ధం చేసిన ప్రతిపాదనలను పరిశీలించారు. (1/3) pic.twitter.com/fdwgegekLN
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 17, 2025