గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు పారిశ్రామిక వేత్తలను ఇబ్బందులు పెట్టారని ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమలు, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుపై దృష్టి సారించామని ఆయన చెప్పారు. బుధవారం విజయవాడ సమీపంలోని గన్నవరం నియోజకవర్గ పరిథిలోని మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 2019-24 మధ్య ఏపీ నుంచి అనేక పరిశ్రమలు తరలి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా రాని పరిస్థితిని ఆ నాటి పాలకులు తీసుకు వచ్చారన్నారు. ఇంకా చెప్పాలంటే.. 2014-2019 లో చేసిన ఒప్పందాలను గత పాలకులు అర్ధం లేకుండా చేశారని మండిపడ్డారు.
ప్రధాని ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో అశోక్ లేలాండ్ సంస్థ విధానాలను అమలు చేస్తుందని చెప్పారు. అలాగే త్వరలో మచిలీపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు రానుందన్నారు. గత పది నెలల్లో ఏపీకి రూ. 7 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని గణాంకాలతో సహా మంత్రి నారా లోకేష్ విశదీకరించారు. తద్వారా నాలుగు లక్షల మందికి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. ఇక ఏపీ అసెంబ్లీలో కొత్తగా అడుగు పెట్టిన ఎమ్మెల్యేలు 50 శాతం మంది ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వ కేబినెట్‌లోని 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్త వారేనని చెప్పారు.
Also Read.. | సురక్షితంగా భూమిపైకి సునీతా విలియమ్స్.. అంతరిక్ష యాత్ర విజయవంతం
స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు పరిశ్రమలపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. అలాగే మల్లవల్లి పారిశ్రామిక వాడకు మరిన్ని పరిశ్రమలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆ బాధ్యత తీసుకుంటారని.. ఆ క్రమంలో అందరితో ఆయన మాట్లాడతారన్నారు. అశోక్ లేలాండ్ సంస్థ స్పూర్తితో రాష్ట్రానికి చాలా మంది పారిశ్రామిక వేత్తలు వస్తారని తెలిపారు. ప్రతిభ ఉన్న యువతను గుర్తించి ప్రోత్సహించాలని సిఎం చంద్రబాబు తమకు ఎప్పుడూ చెబుతుంటారన్నారు. అటువంటి యువత ప్రతిభను మనమే వినియోగించుకునేలా ఇక్కడే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉందని నారా లోకేష్ చెప్పారు.