Menu

  • Home
  • తెలంగాణ
  • తెలంగాణలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
municipal elections polling in telangana

తెలంగాణలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే 116 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పట్టణ ఓటర్లు తమ ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పురుషుల (25.62 లక్షలు) కంటే మహిళా ఓటర్లే (26.80 లక్షలు) అధికంగా ఉండటంతో, అభ్యర్థుల గెలుపోటముల్లో ఈసారి మహిళా ఓట్లు కీలకం కానున్నాయి. బరిలో మొత్తం 12,993 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో కార్పొరేషన్ల పరిధిలో 2,225 మంది, మున్సిపాలిటీల్లో 10,719 మంది పోటీ పడుతున్నారు.

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ 11గం. వరకు 28.48%

ఉదయం 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో కలిపి 28.48% పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందుకోసం బ్యాలెట్ పేపర్ విధానాన్ని ఎంచుకుంది. 16,301 బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా 1,302 కేంద్రాలను ‘అత్యంత సమస్యాత్మక’ ప్రాంతాలుగా గుర్తించారు. అదనంగా 3,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. అన్ని కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించారు. పోలింగ్ సరళిని హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.ఉదయం 11 గంటల వరకు 28.48% పోలింగ్ నమోదు అయిందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఉదయం నుంచే రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజలను చైతన్యపరుస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఓటు వేయగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్‌లోని సన్‌ఫ్లవర్ హైస్కూల్‌లో ఓటు వేశారు.

సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు కట్టుదిట్టమైన నిఘాలో పోలింగ్ కొనసాగుతుంది.

Share the post