అనుపమ పరమేశ్వరన్ ‘పరాదా’ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తార, ప్రస్తుతం మలయాళంలో రూపొందుతున్న ‘పరాదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఆగస్టు 22న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ ఇటీవలే ‘థీమ్ ఆఫ్ పరాదా: యత్ర నార్యస్తు పూజ్యంతే..’ అనే పాటను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ సినిమా విడుదల వెనుక ఉన్న కష్టాలను, ఒక మహిళా ప్రధాన చిత్రానికి ఎదురయ్యే సవాళ్లను భావోద్వేగంగా వెల్లడించారు.
అనుపమ ఏమన్నారంటే…
అనుపమ మాట్లాడుతూ, ‘పరాదా’ ఒక సాధారణ సినిమా కాదని, తన కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడుకున్న పాత్రల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. “ఒక మంచి విడుదల తేదీ దొరకడానికి ఆరు నెలలు పట్టింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అదేరోజు పెద్ద సినిమా రిలీజ్ అయ్యేది. థియేటర్లు దొరకలేదు. అందుకే ఇంత సమయం పట్టింది. నిజం చెప్పాలంటే.. ఒక అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన సినిమా వస్తుందంటే.. ఎవరూ ముందుకురారు. నిర్మాతలు, ఓటీటీ సంస్థలు, ఒక్కోసారి ఆడియన్స్ కూడా ప్రోత్సహించడానికి ముందుకురారు. అది ఎంత మంచి సినిమా అయినా అంతే. దాన్ని తప్పు అని నేను అనడం లేదు. అది వాస్తవం. ‘పరాదా’ కారణంగానే ఈ వాస్తవాన్ని తెలుసుకున్నాను,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు సంవత్సరం క్రితమే సినిమా సిద్ధమైనా, విడుదల కోసం ఇంతకాలం నిరీక్షించాల్సి వచ్చిందని, ఈ క్రమంలో చిత్ర బృందం పడిన శ్రమను దగ్గరగా చూశానని అనుపమ వివరించారు.
మెగాస్టార్ బర్త్ డే కి మించిన మంచి డేట్ దొరకదు
— Filmy Focus (@FilmyFocus) July 17, 2025
ఇఫ్ఫీ అవార్డ్ తీసుకునే ముందు కూడా చిరంజీవి గారి ఆశీస్సులు తీసుకున్నాను..#AnupamaParameswaran #Paradha #PraveenKandregula pic.twitter.com/96hjyYQTqY
Also Read..| తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల లెక్క ఖరారు
‘పరాదా’ చిన్న సినిమా అని అందరూ చెబుతున్నా, ఇది చాలా మంచి సినిమా అని, ఎన్నో కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయని అనుపమ భరోసా ఇచ్చారు. “చిరంజీవి పుట్టినరోజుకు మించి ఈ సినిమాను విడుదల చేయడానికి మంచి తేదీ ఉండదు. అందుకే ఆగస్టు 22న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించాం,” అని దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల వెల్లడించారు. తన మొదటి చిత్రం ‘సినిమా బండి’కి ఇఫీలో అవార్డు వచ్చినప్పుడు చిరంజీవి దగ్గర నుంచి దీవెనలు తీసుకున్న విషయాన్ని, అలాగే రామానాయుడు స్టూడియోస్లో సురేశ్ బాబు తనను ప్రోత్సహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సురేశ్ బాబు ‘పరాదా’ కథ విన్న తర్వాత కళ్లల్లో నీళ్లు తిరిగాయని, ఇది తనకెంతో ప్రత్యేకమని దర్శకుడు తెలిపారు. సినిమా అంతా ‘పరదా’లోనే ఉండాలంటే ఏ నటీ అంగీకరించదని, అలాంటి సవాలుతో కూడుకున్న పాత్రకు అనుపమ అంగీకరించడం ఆమె అంకితభావానికి నిదర్శనమని ప్రవీణ్ ప్రశంసించారు. విభిన్నమైన సోషియో డ్రామాగా రూపొందిన ‘పరాదా’ చిత్రం, అనుపమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.





