కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేర పనిచేస్తోందని, ప్రజల అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం రైల్వే సాధన సమితి సభ్యులు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలశారు. రైల్వేలైన్ అంశాన్ని ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. చిలకలూరిపేటకు రైల్వేలైన్ అత్యవసరమని, కూటమి ప్రభుత్వం రైల్వేలైన్ అంశంపై సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలోనే తాను రైల్వే లైన్ ఏర్పాటు విషయంలో మద్దతు తెలియజేశానని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు రానున్నాయని.. పర్యాటక కేంద్రం కొండవీడు మరింత అభివృద్ది జరగనుందని తెలిపారు. విస్తరించే పరిశ్రమలకు, పెరిగే పర్యాటకులకు రైల్వే లైన్ వల్ల అత్యధిక ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ఈ అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించి, చిలకలూరిపేట ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే లైన్ ఏర్పాటుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్బంగా రైల్వే లైన్ సాధన సమితి కన్వీనర్ షేక్ సుభాని మాట్లాడుతూ.. చిలకలూరిపేటకు రైల్వేలైన్ ఏర్పాటు విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, పారిశ్రామికవేత్తలు సైతం సంఘీభావం ప్రకటించారని తెలిపారు. ఈ అంశంపై ముందడుగు పడాలంటే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత కొనసాగుతున్న నేపథ్యంలో రైల్వేలైన్ సాధన విషయంలో ముందడుగు పడనుందని అన్నారు.