ఏపీలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్యాకేజీ ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము అధికారం చేపట్టిన నాటి నుండి అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. వరదల వల్ల నష్టపోయినవారికి పరిహారం ఇస్తామన్నారు. ప్రతీఇంటికి రూ.25 వేల సాయం, ఇంటి మొదటి అంతస్తులో ఉండేవారికి రూ.10 వేలు, చిరు వ్యాపారులకు రూ.25వేలు, ఇండ్లలోనికి నీరువచ్చినవారికి 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించి అండగా ఉంటామని అన్నారు. అలాగే వాహనాలకు కూడా నష్టపరిహారంగా.. టూవీలర్స్ కు రూ.3వేలు, త్రీవీలర్ కు రూ.10వేలు, బోట్, నెట్ లకు పాక్షికంగా నష్టం అయితే రూ.9వేలు, పూర్తిగా నష్టం అయితే రూ.20వేలు ఇస్తామన్నారు. పశువులకు రూ.50వేలు, చెరకు రూ.25వేలు, వరి ఎకరానికి రూ.10వేలు, సెరికల్చర్ కు రూ.6వేల చొప్పున నష్టపరిహారాన్ని అందజేస్తామని, వరదల వల్ల ఇళ్లు కోల్పోయిన వారికి ఇండ్లు కట్టిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.