ప్రజల ప్రాణాలు పోతున్న సమయంలో కూడా వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయడం తగదని వారికి హితవు పలికారు. గతంలో వారి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండి పడిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రూ. 400 కోట్లతో బుడమేరు పనులు చేపట్టిందని.. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనులను పూర్తి చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని పురందేశ్వరి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం బుడమేరు పనులను పూర్తి చేసి ఉంటే ఇంతటి విపత్తు సంభవించేదే కాదని ఆమె అన్నారు. వారు చేసిన పాపాన్ని పక్కవారిపై నెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.