ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ కార్యవర్గ సమావేశాలు గురువారం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర అటవీశాఖ మంత్రి సుబోధ్ అనియాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు శ్రీనివాస్ రెడ్డి సమావేశాన్ని ప్రారంభిస్తూ.. దేశంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని అన్నారు. అందుకోసం ప్రత్యేక రక్షణ చట్టం కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ పై జర్నలిస్ట్ సమాజంలో చర్చ జరుగుతున్నదని, తమ సంఘం దీనిపై వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టిందని తెలిపారు. జర్నలిస్టులకు స్వేచ్ఛ కావాలని అన్నారు. అందుకు తాము కట్టుబడి ఉన్నామని చెపుతున్న పాలకులు ప్రత్యేక రక్షణ చట్టం తేకపోవడం విచారకరమని అన్నారు. జర్నలిస్టులకు 1955లో ఆనాటి పార్లమెంట్ చేసిన వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ ను నేడు మరింత పటిష్టం చేయాల్సింది పోయి అందుకు విరుద్ధంగా కార్మిక చట్టాల కోడిఫికేషన్ పేరుతో దాన్ని పూర్తిగా రద్దు చేయడం ఆందోళనకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కొత్తగా తెచ్చిన బిల్లును దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని అన్నారు. తమ సంఘం కూడా దీనిపై నిరసనలు, ఆందోళనలు పెద్దఎత్తున చేపట్టిందన్నారు. ప్రస్తుతానికి పెండింగులో ఉన్న ఈ బిల్లును తిరిగి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం శోచనీయమన్నారు. గతంలో ఉన్న చట్టం స్థానంలోనే కొత్త చట్టం వస్తున్నదంటే, గతం కంటే ఎక్కువ ఉపయోగాలు జర్నలిస్టులకు ఉండేలా బిల్లు ఉండాలి తప్ప గతంలో ఉన్న సౌకర్యాలను తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకోవడం తగదని శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వానికి హితవు పలికారు.