బిహార్‌లో (Bihar) కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్‌డౌన్ మొదలైంది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుందని తెలుస్తోంది. జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్ మరోసారి బిహార్ సీఎంగా పదవి చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి పాట్నాలోని గాంధీ మైదానం వేదిక కానుంది. ఇప్పటికే అట్టహాసంగా ప్రమాణస్వీకార వేడుక నిర్వహించేందుకు పనులు ప్రారంభమయ్యాయి. నితీష్ కుమార్ తన రాజకీయ అనుభవంతో, మిత్రపక్షాల సహకారంతో బిహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈప్రమాణ స్వీకారానికి ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హాజరు కానున్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కీలకమైన రాజ్యాంగపరమైన ప్రక్రియ నవంబర్ 17 జరగనుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రేపు కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో, పదవీకాలం ముగిసిన 17వ శాసనసభ రద్దు తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించనుంది. ఈ తీర్మానం ఆమోదం పొందిన వెంటనే, నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించనున్నారు. నితీష్ రాజీనామా తర్వాత, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం రద్దవుతుంది. అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది.
నితీష్ కుమార్ రాజీనామా సమర్పించిన వెంటనే, ఎన్డీయే కూటమి (NDA) భాగస్వామ్య పక్షాలు శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించనున్నాయి. ఈ సమావేశాలలో, NDA కూటమిలోని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. కూటమిలో నితీష్ కుమార్‌కు ఉన్న అనుభవం, మెజారిటీ మద్దతు నేపథ్యంలో, ఎమ్మెల్యేలు ఆయన్నే NDA నాయకుడిగా ఎన్నుకునే అవకాశం ఉంది. అనంతరం, నితీష్ కుమార్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరుతూ గవర్నర్‌ను కలుస్తారు. గవర్నర్ ఆమోదంతో, ప్రమాణస్వీకారానికి తేదీ ఖరారై, నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు.









