ఉద్యోగం చేసే మహిళకు భరణం అక్కర్లేదు అని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విడాకుల తర్వాత భార్య భరణం కోసం భర్తపై ఆధారపడడంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక విడాకుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉన్నత విద్య చదివి, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండగలిగే సామర్థ్యం ఉన్న మహిళలు విడాకుల తర్వాత భరణం కోసం పాకులాడకూడదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భర్తపై ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించవచ్చని సూచించింది.
ముంబైకి చెందిన ఒక జంట 18 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. కొద్దికాలం తర్వాత వారి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా సదరు మహిళ తన భర్త నుంచి భరణం కింద ఏకంగా రూ.12 కోట్లతో పాటు, ముంబైలో ఒక విలాసవంతమైన ఫ్లాట్‌ను ఇప్పించాలని కోర్టును కోరింది.
Also Read…| మెడికల్ కాలేజీల్లో నివాస అర్హత నిబంధన పై తీర్పు రిజర్వు
ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మహిళా పిటిషనర్ విద్యాభ్యాసం, ఆమెకున్న అర్హతలను పరిశీలించారు. ఆమె ఉన్నత చదువులు చదివినట్లు తెలుసుకుని, “మీరు బాగా చదువుకున్నారు. మరి మీరెందుకు ఉద్యోగం చేయకూడదు? ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా సంపాదించుకుంటూ హుందాగా, గౌరవంగా జీవించవచ్చు కదా!” అని ప్రశ్నించారు. భరణం అనేది నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి, తమ కాళ్ళ మీద తాము నిలబడలేని వారికి ఉద్దేశించినదే తప్ప, అర్హత ఉన్న వారు దానిని దుర్వినియోగం చేయకూడదని కోర్టు అభిప్రాయపడింది. భార్యకు భరణం ఇవ్వడం అనేది ఆమె భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితం చేయడానికే తప్ప, సంపాదన సామర్థ్యం ఉన్నవారిని సోమరిపోతులుగా మార్చడానికి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఇరుపక్షాల వాదనలు, మహిళకున్న అర్హతలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ఆమె కోరిన భారీ మొత్తం రూ.12 కోట్లను భరణంగా ఇవ్వడానికి నిరాకరించింది. అయితే, భర్త నుంచి ఆమెకు ఒకేసారి సెటిల్‌మెంట్‌గా ముంబైలో లగ్జరీ ఫ్లాట్‌ను మాత్రమే భరణంగా ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పు దేశంలో విడాకుల చట్టాలకు ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇకపై ఉన్నత విద్యావంతులైన, ఉద్యోగ సామర్థ్యం ఉన్న మహిళల భరణం కేసులలో ఈ తీర్పు ఒక ముఖ్యమైన మార్గదర్శకంగా నిలిచిపోయే అవకాశం ఉంది.









