Menu

  • Home
  • జాతీయం
  • ‘ఓట్ల చోరీ’ ఆరోపణలకు రాహుల్ గాంధీకి రాజ్ థాకరే మద్దతు !
Rajthackray supports Rahul gandhi

‘ఓట్ల చోరీ’ ఆరోపణలకు రాహుల్ గాంధీకి రాజ్ థాకరే మద్దతు !

రాహుల్ గాంధీకి రాజ్ థాకరే మద్దతు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ‘ఓట్ల చోరీ’ జరుగుతోందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ థాకరే మద్దతు పలికారు. ఈ అంశంపై తాను చాలాకాలంగా పోరాడుతున్నప్పటికీ ప్రతిపక్షాలు తన మాట వినలేదని ఆయన అన్నారు.

పూణేలో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో రాజ్ థాకరే మాట్లాడుతూ.. ఓట్ల తారుమారు సమస్య కొత్తదేమీ కాదని అన్నారు. “నేను 2016-17 లోనే ఈ విషయాన్ని లేవనెత్తాను. అప్పట్లో శరద్ పవార్, సోనియా గాంధీ, మమతా బెనర్జీ వంటి నాయకులను కలిసి లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని సూచించాను. అలా చేస్తే ప్రపంచ దృష్టిని ఆకర్షించి, అంతర్జాతీయ ఒత్తిడి పెంచవచ్చని చెప్పాను. కానీ, అప్పట్లో అందరూ భయపడి వెనక్కి తగ్గారు,” అని విమర్శించారు.

ప్రజలు ఓట్లు వేస్తున్నప్పటికీ, అవి అభ్యర్థులకు చేరడం లేదని థాకరే ఆరోపించారు. “2014 నుంచి ఈ ఎన్నికల గందరగోళాన్ని ఉపయోగించుకునే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి,” అని ఆయన అన్నారు. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా చూపిస్తూ, బీజేపీ, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ వర్గాలు గెలిచినప్పటికీ, ఆ ఫలితాలను గెలిచినవారు, ఓడినవారు ఎవరూ జీర్ణించుకోలేక పోయారని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన తన పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు.

Also Read..| తెలంగాణ‌లో హెలీ టూరిజం.. ఎక్క‌డో తెలుసా..?


ఇటీవల రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కైందని, ఎన్నికలను దొంగిలిస్తోందని ఆరోపించారు. కర్ణాటకలోని మహదేవ పుర నియోజకవర్గంలో 6.5 లక్షల ఓట్లకు గాను లక్షకు పైగా ఓట్లు చోరీ జరిగాయని, ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు చేర్చారని ఆయన విమర్శించారు. అయితే, ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని, లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేసింది.

Share the post