Menu

  • Home
  • జాతీయం
  • ఉద్యోగుల వ్యక్తిగత ప్రతిభకు ‘ఎస్బీఐ-స్టార్‌’ అవార్డు
sbi-awards-for-employees

ఉద్యోగుల వ్యక్తిగత ప్రతిభకు ‘ఎస్బీఐ-స్టార్‌’ అవార్డు

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ ఉద్యోగుల వృత్తి పరమైన బాధ్యతలతో పాటు వ్యక్తిగత ప్రతిభను, సమాజ సేవను గుర్తించేందుకు ఓ అవార్డును ప్రకటించింది. ‘ఎస్బీఐ-స్టార్ (స్టాఫ్ టాలెంట్ అక్నాలెడ్జ్‌మెంట్ అండ్ రికగ్నిషన్)’ పేరిట ప్రతి సంవత్సరం ఈ అవార్డులను అందించనున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ అవార్డు ద్వారా కళలు, సాహిత్యం, క్రీడలు, సాంస్కృతిక కార్యకలాపాలు, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ వంటి వృత్తి బాధ్యతలకు అతీతమైన రంగాలలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను సత్కరించనున్నారు. ఉద్యోగులను ప్రోత్సహించడం, వారిలో సంస్థ పట్ల గౌరవభావాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం.

వ్యక్తిగత ప్రతిభను గుర్తించడం బ్యాంకుకు ముఖ్యం: ఎస్బీఐ ఛైర్మన్

ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగులను వారి వృత్తిపరమైన పనితీరుకే కాకుండా, వారి వ్యక్తిగత ఆసక్తులు, అభిరుచులు, వారు సమాజానికి అందించే సేవలను కూడా గుర్తించడం చాలా ముఖ్యమని అన్నారు. ఈ దిశగా ‘ఎస్బీఐ-స్టార్’ అవార్డు ఒక ముందడుగు అని ఆయన తెలిపారు. సృజనాత్మకత, పట్టుదలతో కూడిన వ్యక్తిగత ప్రతిభను ప్రదర్శించిన అనేక మంది ఉద్యోగులు ఎస్బీఐలో ఉన్నారని ఆయన అన్నారు. ఉదాహరణకు.. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా ఎదిగిన ప్రతిక్షా టోండ్వాల్కర్, అంకితభావంతో పనిచేస్తున్న సన్వలి, 71 ఏళ్ల వయసులో కూడా చార్టర్డ్ అకౌంటెన్సీ పరీక్షలో విజయం సాధించిన రిటైర్డ్ బ్యాంకర్ తారాచంద్ అగర్వాల్, అలాగే భారత బ్లైండ్ క్రికెట్ జట్టుకు ఐదు సార్లు ప్రపంచకప్ అందించిన అర్జున అవార్డు గ్రహీత ఇల్లూరి అజయ్‌కుమార్ రెడ్డి వంటి వారి స్ఫూర్తిదాయక విజయాలను ఆయన ఈ సందర్బంగా ప్రస్తావించారు.

Also Read…| లండన్ లో సీఎం చంద్రబాబు దంపతులకు ఘనస్వాగతం

ఎంపికలో పారదర్శకత

ఉద్యోగుల వ్యక్తిగత ప్రతిభను గుర్తించే ఈ ‘ఎస్బీఐ-స్టార్’ అవార్డును అత్యంత పారదర్శకంగా, సమగ్రమైన విధానంలో అందించాలని బ్యాంకు నిర్ణయించింది. ఈ అవార్డుల కోసం ఉద్యోగులు స్వయంగా తమను తాము నామినేట్ చేసుకునే అవకాశం కల్పించింది.ప్రతి సర్కిల్ లో, విభాగంలో నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా వారి ప్రతిభను పరిశీలించి ఎంపిక చేస్తుంది. తుది జాబితాను ముంబయిలోని కార్పొరేట్ సెంటర్ నిర్ణయిస్తుంది. వివిధ విభాగాలలో ఉద్యోగుల ప్రతిభ సంస్థ అభివృద్ధికి, కొత్త ఆవిష్కరణలకు దోహదపడుతుందని బ్యాంకు విశ్వసిస్తోంది.

Share the post

Also Read..