దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సహా ఆరుగురు వ్యక్తులు, మూడు కంపెనీలపై ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) తాజాగా కొత్త ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసింది. ఈడీ (enforcement directorate) అందించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా అక్టోబర్ 3న ఈ ఎఫ్ఐఆర్ దాఖలైంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడా, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL), యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను ఇందులో నిందితులుగా చేర్చారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ మాతృసంస్థ అయిన ఏజేఎల్ ను మోసపూరిత మార్గాల ద్వారా చేజిక్కించుకునేందుకు నిందితులు క్రిమినల్ కుట్రకు పాల్పడ్డారని EOW ఆరోపించింది.
ఈ కేసు ప్రధాన ఆరోపణ ఏంటంటే, సుమారు రూ. 2000 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్న ఏజేఎల్ పై యంగ్ ఇండియన్ సంస్థ నియంత్రణ సాధించడమే. యంగ్ ఇండియన్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కలిపి 76% వాటాలున్నాయి. ఈ లావాదేవీలో భాగంగా, కోల్‌కతాకు చెందిన షెల్ కంపెనీగా ఆరోపించబడుతున్న డోటెక్స్ మర్చండైజ్, యంగ్ ఇండియన్‌కు రూ. 1 కోటి అందించింది. ఆ తర్వాత, యంగ్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీకి రూ. 50 లక్షలు చెల్లించి ఏజేఎల్ ఆస్తులపై అధికారం పొందిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి 2012లో దాఖలు చేసిన ప్రైవేట్ పిటిషన్‌తో ఈ కేసు మొదలైంది. ప్రస్తుతం ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌పై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.









