Menu

  • Home
  • తెలంగాణ
  • మెడిక‌ల్ కాలేజీల్లో నివాస అర్హ‌త నిబంధ‌న పై తీర్పు రిజ‌ర్వు
Telangana medical admissions domicile verdict

మెడిక‌ల్ కాలేజీల్లో నివాస అర్హ‌త నిబంధ‌న పై తీర్పు రిజ‌ర్వు

రాష్ట్రంలోని వైద్య‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెడిక‌ల్ కాలేజీల్లో నివాస అర్హ‌త నిబంధ‌న ఇప్పుడు న్యాయపరమైన వివాదాలకు కార‌ణం అయింది. రాష్ట్రంలో 12వ తరగతి వరకు చివరి నాలుగేళ్లు చదువుకున్న వారికే రాష్ట్ర కోటా కింద ప్రవేశాలు కల్పిస్తామని ప్రభుత్వం చేసిన సవరణపై హైకోర్టు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసి రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాల‌పై సుప్రీంకోర్టు విచార‌ణ ముగించింది. ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగ సిబ్బంది మ‌రియు ఉన్నత విద్య కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన విద్యార్థులు ఈ నిబంధన వల్ల ఎలా నష్టపోతారని న్యాయస్థానం ప్రశ్నించింది. మరి ఈ నిబంధన వెనుక ఉన్న ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి? ఇది నిజంగా రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుందా, లేక వారిపైనే ప్రతికూల ప్రభావం చూపుతుందా? దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పును వెలువరించనుంది అనేది ఉత్కంఠ‌గా మారింది.

తెలంగాణ ప్రభుత్వం 2024లో తీసుకొచ్చిన ఈ నిబంధన ప్రకారం, చివరి నాలుగేళ్లు అంటే 9, 10, 11, 12 తరగతులను రాష్ట్రంలోనే పూర్తి చేసిన విద్యార్థులు మాత్రమే రాష్ట్ర కోటా కింద మెడికల్, డెంటల్ కళాశాలల్లో అడ్మిషన్లకు అర్హులు. తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్నప్పటికీ, ఇతర కారణాల వల్ల కొన్ని సంవత్సరాలు రాష్ట్రం వెలుపల చదువుకున్న విద్యార్థులు ఈ నిబంధనతో అర్హత కోల్పోతున్నారు. ఈ సవరణ ముఖ్య ఉద్దేశం తెలంగాణ విద్యార్థులకు, ప్రత్యేకించి రాష్ట్రంలోనే చదువుకున్న వారికి ఎక్కువ అవకాశాలు కల్పించడమే అని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, ఈ నిబంధన కారణంగా కొన్ని వర్గాల విద్యార్థులు, ముఖ్యంగా వారి తల్లిదండ్రులు ఉద్యోగాల నిమిత్తం బదిలీపై వెళ్లిన వారు తీవ్రంగా న‌ష్ట‌పోతారాని వారి వాద‌న‌.

ఈ నిబంధనను సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, విచారణ అనంతరం హైకోర్టు దానిని రద్దు చేసింది. కేవలం కొంతకాలం రాష్ట్రం వెలుపల ఉన్నందున శాశ్వత నివాసులైన విద్యార్థులకు ప్రవేశాలు నిరాకరించలేమని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ల నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ వాదనలపై అనేక సందేహాలను లేవనెత్తింది. తెలంగాణకు చెందిన ఒక న్యాయమూర్తి లేదా ఐఏఎస్ అధికారి బదిలీపై వెళ్ళినప్పుడు వారి పిల్లలు సొంత రాష్ట్రంలో ప్రవేశాలకు ఎలా అనర్హులు అవుతారని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ నిబంధనలో ఉన్న వైరుధ్యాన్ని జస్టిస్ వినోద్ చంద్రన్ ఉదాహరణతో వివరించారు: ఒక వ్యక్తి నాలుగేళ్లు తెలంగాణలో ఖాళీగా ఉంటే అర్హత పొందుతారు, కానీ చదువు కోసం బయటకు వెళ్తే అనర్హులవుతారు, ఇది ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.

ప్రభుత్వ అప్పీలుకు వ్యతిరేకంగా కొంతమంది విద్యార్థులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానికత నిబంధనల నుంచి మినహాయింపులు ఇచ్చిన విషయాన్ని వారు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తమకూ మినహాయింపులు ఇవ్వాలని అభ్యర్థించారు. తెలంగాణలో పుట్టి, 10వ తరగతి వరకు ఇక్కడే చదివినా, 11, 12 తరగతులు బయట చదవడం వల్ల నీట్ స్థానిక కోటా దక్కక నష్టపోతున్నామని వారు వివరించారు. ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చే తీర్పు అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు అభిప్రాయప‌డుతున్నారు.

Also Read..| బీసీల‌కు 42% రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆమోదించాల్సిందే..!

ప్రస్తుతానికి సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఒకవేళ కోర్టు హైకోర్టు తీర్పును సమర్థిస్తే, రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించాల్సి ఉంటుంది. దీనివల్ల అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు, సుప్రీంకోర్టు ప్రభుత్వ నిబంధనను సమర్థిస్తే, భవిష్యత్తులో విద్యార్థులు తమ చదువుల విష‌యంలో ముంద‌స్తు జాగ్ర‌త్త తీసుకోవ‌ల‌సి ఉంటుంది. ఈ నిబంధన కారణంగా ఇప్పటికే నష్టపోయిన విద్యార్థుల భవితవ్యంపై కూడా దీని ప్రభావం పడే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ వివాదం కేవలం నివాస అర్హతకు మాత్రమే పరిమితం కాకుండా సమాన అవకాశాలు, విద్యహక్కు లాంటి అంశాలపై కూడా చర్చకు తెర‌లేపే అవ‌కాశం క‌న‌బ‌డుతోంది.

సుప్రీంకోర్టు తీర్పు విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రభుత్వంతో పాటు మొత్తం వైద్య విద్య వ్యవస్థపై ప్రభావాన్ని చూపే అవకాశం క‌న‌బడుతోంది. ఒకవేళ సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థిస్తే, తెలంగాణ ప్రభుత్వం అడ్మిషన్ల కోసం కొత్త నిబంధనలను రూపొందించాల్సి వస్తుంది. దీనివల్ల ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియలో మ‌రింత‌ జాప్యం జరగవచ్చు. మరోవైపు, ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనను సుప్రీంకోర్టు ఆమోదిస్తే, రాష్ట్ర కోటాలో సీట్లు ఆశిస్తున్న చాలా మంది విద్యార్థులు అర్హత కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ తీర్పు కేవలం తెలంగాణకే కాకుండా, ఇలాంటి నిబంధనలు ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా మారే అవ‌కాశం ఉంటుంద‌ని పలువురు న్యాయ‌నిపుణులు అంటున్నారు. ఇరుప‌క్షాల వాద‌న‌ల అనంత‌రం స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తీర్పును రిజ‌ర్వు చేసింది.

Share the post

Also Read..