తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌లో రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో పసుపు బోర్డు సెక్రెటరీ ఎన్. భవానీ శ్రీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కొత్తగా ఏర్పాటైన పసుపు బోర్డు గత ఆరు నెలలుగా చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పురోగతి వివరాలను సెక్రెటరీ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా, పసుపు సాగు మరియు మార్కెటింగ్‌కు సంబంధించి మంత్రి తుమ్మల కొన్ని కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా, ప్రస్తుతం వాడుకలో ఉన్న రకాలకు బదులుగా అధిక ‘కుర్క్ మిన్’ శాతం ఉన్న నూతన పసుపు రకాలను సాగు చేయించేలా రైతులకు ప్రోత్సాహం అందించాలని ఆయన కోరారు.
పసుపు సాగులో వైవిధ్యం తీసుకురావాల్సిన ఆవశ్యకతను మంత్రి తుమ్మల చెప్పారు. ఆయిల్ పామ్ తోటల్లో ‘అంతర పంట’గా పసుపును సాగు చేసే అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆయన బోర్డును సూచించారు. అంతేకాక, పురుగు మందులు, కలుపు మందుల వినియోగాన్ని తగ్గించడం ద్వారా మార్కెటింగ్ అవకాశాలను మెరుగుపర్చవచ్చని అభిప్రాయపడ్డారు. పసుపు ఉత్పాదకాల మార్కెటింగ్‌పై బోర్డు ప్రత్యేక దృష్టి సారించాలని, ఫార్మా మరియు ఆయుర్వేద రంగంలో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మార్కెటింగ్ లింకేజీలను కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బోర్డు సెక్రటరీకి సూచించారు.
మంత్రి సూచనలకు స్పందించిన సెక్రెటరీ భవానీ శ్రీ, కోత అనంతర నిర్వహణ (Post-harvest management)లో రైతులకు అందిస్తున్న తోడ్పాటును వివరించారు. ఇందులో భాగంగా, రైతు ఉత్పత్తి సంఘాలను (FPOs) గుర్తించి, వారికి రూ. 23 లక్షల వరకు రాయితీని అందించి, పసుపు ఉడకబెట్టే యంత్రాలు, పాలిషర్స్, గ్రైండర్లు వంటి అవసరమైన పనిముట్లను, యంత్రాలను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు సమగ్ర సస్యరక్షణ (IPM) పద్ధతులు, సేంద్రీయ ధృవీకరణ (Organic Certification) వంటి అంశాలలోనూ తోడ్పాటు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు.
Also Read..| ‘ఓట్ల చోరీ’ ఆరోపణలకు రాహుల్ గాంధీకి రాజ్ థాకరే మద్దతు !
పసుపు మార్కెటింగ్ అవకాశాల గురించి వివరిస్తూ.. ప్రస్తుతం పసుపు పొడిని ITC, పతాంజలి వంటి ప్రముఖ కంపెనీలకు సరఫరా చేస్తున్నట్లు సెక్రెటరీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మధ్యప్రాచ్య మరియు తూర్పు దేశాలకు పసుపును సరఫరా చేసే ఓ ప్రముఖ కంపెనీ నిజామాబాద్ జిల్లాలో 10 ఎకరాల స్థలంలో ప్రాసెసింగ్ యూనిట్‌ను స్థాపించడానికి ముందుకు వచ్చినట్లు ఆమె మంత్రికి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి పసుపు బోర్డుకు మరియు రైతులకు సంపూర్ణ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.









