Menu

AndeSri Passed away

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ రూపశిల్పి, ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) సోమవారం ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన మరణవార్త తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, దుఃఖాన్ని నింపింది. సికింద్రాబాద్ లాలాగూడలోని తన నివాసంలో తెల్లవారుజామున కుప్పకూలిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 7:25 గంటలకు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతికి గుండెపోటు కారణమని గాంధీ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు.

ande

గాంధీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అందెశ్రీ గత 15 ఏళ్లుగా తీవ్ర రక్తపోటు (హైపర్‌టెన్షన్) సమస్యతో బాధపడుతున్నారు. అయితే, గత నెల రోజులుగా ఆయన బీపీ మందులను వాడటం లేదని కుటుంబసభ్యుల ద్వారా వైద్యులకు తెలిసింది. ఆదివారం రాత్రి భోజనం చేసి, నిద్రపోయిన ఆయన, సోమవారం తెల్లవారుజామున బాత్రూమ్ వద్ద పడిపోయి కనిపించగా, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకురావడానికి దాదాపు ఐదు గంటల ముందు ఆయన మరణించి ఉండవచ్చని వైద్యులు అంచనా వేశారు. ఆరోగ్యం పట్ల ఆయన చూపిన నిర్లక్ష్యమే ఈ విషాదానికి దారితీసిందని వైద్యులు స్పష్టం చేశారు.

అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన 1961 జూలై 18న సిద్ధిపేట (ఉమ్మడి వరంగల్) జిల్లాలోని మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు. అనాథగా, గొర్ల కాపరిగా పెరిగానే పెరిగారు. బడికి వెళ్లి చదువుకోలేదు. అయినా తన అశువు కవిత్వం, గేయ రచనల ద్వారా సాహిత్య ప్రపంచంలో అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయనలోని ప్రతిభను శృంగేరి మఠానికి చెందిన స్వామీ శంకర్ మహారాజ్ గుర్తించి సాహిత్య రంగంలోకి ప్రోత్సహించారు. స్వయం ప్రవేశంతో ఎదిగిన అందెశ్రీ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు.

తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కవి

అందెశ్రీ తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకత్వం చేసిన కవి. ఆయన రాసిన ‘జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి’ వంటి పాటలు ఉద్యమానికి ఊపిరి పోశాయి. ప్రకృతి, ప్రజలు, తెలంగాణ భాషా-సంస్కృతులపై ఆయన కవిత్వం సాగింది. దాదాపు 400లకు పైగా సినిమా పాటలు రాసిన ఆయన ‘ఎర్ర సముద్రం’ సినిమాలోని ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ పాట ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల సిలబస్‌లో చేర్చారు. రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ అందించిన ఆయన గొంతు మూగబోవడం తెలంగాణ సాహిత్యానికి తీరని నష్టం.

అందెశ్రీ మరణ వార్తవిన్న తర్వాత తన స్వగ్రామం రేబర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. పశువుల కాపరి నుండి అంచెలంచెలుగా ఎదిగి తమ గ్రమానికి అందెశ్రీ పేరు తీసుకొచ్చాడని కన్నీటిపర్యంతం అవుతున్నారు.

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

అందెశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

Share the post

Also Read..