తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం (Cabinet Meeting) జరగనుంది. బనకచర్ల ప్రాజెక్టు పై ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను కేంద్ర జల సంఘానికి (CWC) సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రాజెక్టుకు సంబందించిన వివరాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారుల నుంచి పూర్తి వివరాలను తెప్పించుకుని, సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహచర మంత్రులకు వివరించనున్నారు.
Also Read..| ‘కుబేర’ పై సాయి పల్లవి ప్రశంసల జల్లు
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తన అభ్యంతరాలను ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు తెలియజేసింది. సీఎం రేవంత్ రడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్ళి కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ ను ప్రత్యేకంగా కలిసి తెలంగాణ అభ్యంతరాను తెలిపారు. ఈ అంశాలను కూడా కేబినెట్ సమావేశంలో ప్రస్తావించనున్నారు. ఒకవేళ డీపీఆర్‌కు సీడబ్ల్యూసీ ఏకపక్షంగా ఆమోదం తెలిపితే, దానిని న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై మంత్రివర్గ భేటీలో చర్చకు రానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అంతే కాకుండా సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణపై చర్చించే అవకాశం కనిపిస్తోంది.