కొత్త మంత్రుల శాఖల కేటాయింపు పై చర్చ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆదివారం జూన్ 8, 2025న ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్‌లోని దర్బార్ హాల్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వచ్చిన మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు జరగడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది

- గడ్డం వివేక్ వెంకటస్వామి (చెన్నూరు ఎమ్మెల్యే) – ఎస్సీ (మాల) సామాజిక వర్గం

- అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి ఎమ్మెల్యే) – ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గం

- వాకిటి శ్రీహరి (మక్తల్ ఎమ్మెల్యే) – బీసీ (ముదిరాజ్) సామాజిక వర్గం
ఈ ముగ్గురు మంత్రులు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రి పదవులను దక్కించుకున్నారు. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ ఈ విస్తరణ జరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కేబినెట్‌లో దళిత మంత్రుల సంఖ్య నాలుగుకు చేరింది.

కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై ఉత్కంఠ !
కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారనే దానిపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తుతం హోం, మున్సిపల్ శాఖలతో పాటు పలు కీలక శాఖలు ఉన్నందున, వాటిల్లో కొన్నింటిని కొత్త మంత్రులకు కేటాయించే అవకాశం ఉంది. సామాజిక వర్గాలు, వారి అనుభవం ఆధారంగా శాఖల కేటాయింపు ఉంటుందని భావిస్తున్నారు.
Also Read…| జనగణనలో కులగణన విషయంలో క్రెడిట్ ఏపార్టీకి ?
- గడ్డం వివేక్: క్రీడలు, యువజన సేవలు శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
- అడ్లూరి లక్ష్మణ్ కుమార్: కార్మిక, ఎస్సీ సంక్షేమ శాఖ కేటాయించే ఛాన్స్ ఉంది.
- వాకిటి శ్రీహరి: న్యాయ, పశుసంవర్ధక శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
శాఖలను ఖరారు చేయడానికి ఏఐసీసీ పెద్దలతో చర్చించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అనంతరం అధికారికంగా మంత్రుల పోర్ట్ ఫోలియోలపై ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.
డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రునాయక్
మంత్రివర్గ విస్తరణతో పాటు శాసనసభ ఉప సభాపతి బాధ్యతలను డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్‌కు అప్పగించారు. ఎస్టీ (లంబాడా) సామాజిక వర్గానికి చెందిన రామచంద్రునాయక్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఈ కీలక బాధ్యతలు దక్కించుకున్నారు. ఇప్పటికే కేబినెట్‌లో ఎస్టీ ఆదివాసీ నుంచి మంత్రిగా సీతక్క కొనసాగుతున్నారు.

మొత్తం ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా, ప్రస్తుతానికి మూడు బెర్తులు భర్తీ చేశారు. మరో మూడు స్థానాలు ఖాళీగా ఉండటంతో త్వరలోనే వాటిని కూడా భర్తీ చేస్తారని చర్చ నడుస్తోంది.