Menu

  • Home
  • ఎడిటోరియల్
  • జ‌న‌గ‌ణ‌న‌లో కులగ‌ణ‌న విష‌యంలో క్రెడిట్ ఏపార్టీకి ?
జ‌న‌గ‌ణ‌న‌లో కులగ‌ణ‌న Caste enumeration in the census

జ‌న‌గ‌ణ‌న‌లో కులగ‌ణ‌న విష‌యంలో క్రెడిట్ ఏపార్టీకి ?

దేశవ్యాప్తంగా జ‌న‌గ‌ణ‌న‌లో కులగణన చేయ‌డానికి కేంద్ర ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కులగణనకు ఆమోదం తెలిపింది. త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కలతోపాటే కులగణన చేపట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.

జ‌న‌గ‌ణ‌న‌లో కులగణన ను స్వాగ‌తించిన రాహుల్ గాంధీ


గ‌త కొన్నళ్లుగా ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నా ఎప్పటికప్పుడు ఏవేవో సాకులు చెప్పి దాన్ని తోసిపుచ్చుతూ వచ్చిన కేంద్ర పాలకులు ఇప్పటికి దేశవ్యాప్త కులగణనకు ఆమోదం తెలిపారు. సాధారణ జనగణనలో సేకరిస్తున్న షెడ్యూల్డు కులాలు, తరగతుల వారివి తప్ప ఇతర వెనుకబడిన తరగతులవారి వివరాలు సేక‌రించ‌డం లేదు. శాస్త్రీయమైన రీతిలో ఎస్సీ ఎస్టీలతో సహా ఒబిసిల వివరాలతో దేశవ్యాప్త జన గణన నిర్వహించడం ఎంతో అవసరం అనే నిర్ణ‌యానికి కేంద్ర ప్ర‌భుత్వ రావ‌డం ప‌ట్ల ప్ర‌తిప‌క్షాలు కూడా స్వాగ‌తిస్తున్నాయి.

జ‌న‌గ‌ణ‌న‌లో కులగణన

Also Read…| భద్రతా బలగాలకు పూర్తిస్వేచ్ఛ.. మోడీ సంచలనం

ఒక విధంగా ఇది అనూహ్య పరిణామం. రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటార‌ని, ప్ర‌తిప‌క్షాలే కాదు, స్వపక్షంలోని కీలక నేతలు, చివరకు తలలు పండిన పొలిటిక‌ల్ విశ్లేషకులు కూడా ఊహించలేదు. ఓ వైపు పెహల్గాం ఉగ్రదాడి నేపధ్యంలో ప్రతి ఒక్కరు అటుగా చూస్తున్న సమయంలో ప్రధాని న‌రేంద్ర మోడీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ కూడా ఊహించలేదు. భారత్ – పాక్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న సమయంలో జరిగిన సీసీపీఏ సమావేశం అందుకోసమే అనుకున్నారు. కానీ, అనూహ్యంగా మోదీ, మ్యాజిక్ బాక్స్ లో నుండి కులగణనను బయటకు తీశారు.

ప్ర‌ధాని మోడీ సంచ‌ల‌న నిర్ణ‌యం

అయితే, రాజకీయ మేథావుల మెదళ్ళకు అందని నిర్ణయాలు తీసుకోవడం మోడీకి కొత్తేమీ కాదు. గతంలో ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీ Look London, See Paris అనేవిధంగా ప‌లు సంచ‌ల‌న‌ నిర్ణయాలు తీసుకున్నారని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఇటీవ‌ల ఆంద్ర‌ప్ర‌దేశ్ నుండి రాజ్యసభ ఉపఎన్నిక అభ్యర్ధి ఎంపిక విషయంలో కూడా ఇలాగే అందరి అంచనాలను మోడీ తలకిందులు చేశారు. రేసులో ఉన్న‌వారిని పక్కన అపెట్టి, అసలు రేసులో లేని పాకా సత్యనారాయణను మోడీ ఎంపిక చేశారు. నిజానికి విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు విజయసాయి నుండి మొద‌లుకొంటే.. త‌మిళ‌నాడు అన్నామలై వరకు చాలా పేర్లు వినిపించాయి. కానీ, చివరకు వినిపించని, కనిపించని పాకా ను అదృష్టం వరించింది. గతంలో చాలా రాష్ట్రాల సీఎంల‌ ఎంపిక విషయంలోనూ మోడీ ఇదే మేజిక్ చేసి చూపించారని ప‌లువురు గుర్తు చేస్తున్నారు.

జ‌న‌గ‌ణ‌న‌లో కుల‌గ‌ణ‌న‌కు కాంగ్రెస్ పూర్తి స‌హ‌కారం

కుల‌గ‌ణ‌న చేయ‌డానికి నిర్ణయం ఏవిధంగా జరిగినా అధికార, ప్రతిపక్ష కూటముల పార్టీలన్నీ మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. ముఖ్యంగా కులగణనను ఇంటా బయటా ప‌దే ప‌దే ప్ర‌చారం చేస్తున్న కాంగ్రెస్ అగ్ర‌నేత‌, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోడీ తీసుకున్న‌ నిర్ణయాన్ని స్వాగతించారు. స్వాగాతించడమే కాదు.. కేంద్ర ప్రభుత్వం చేపట్టే కులగణనకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని రాహుల్ అన్నారు. అయితే కులగణనను ఎంత స‌మ‌యంలో పూర్తిచేస్తారో.. నిర్ణీత సమయం తెలపాలని, కులగణనకు తెలంగాణ మోడల్ ను నమూనాగా తీసుకోవాలని సూచించారు.

జ‌న‌గ‌ణ‌న‌లో కులగణన

అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించే సమయంలోనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్ చాలా స్పష్టంగా వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సర్కార్లు తీసుకొచ్చిన సర్వేలు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయని అన్నారు. అందుకే, పారదర్శకంగా జ‌న‌గ‌ణ‌న‌లో కులగణన జరగాలని కేంద్రం భావిస్తోందనీ, ఇందు కోసం సర్వేలపై ఆధారపడకుండా జనాభా లెక్కలలోనే ఈ విషయం నిర్ధారణ చేసుకుంటే సామాజిక సమతుల్యతకు ఆస్కారం లభిస్తుందని మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు. దీన్ని బ‌ట్టి చూస్తే తెలంగాణ మోడల్ ను కేంద్రం పరిశీలించే అవకాశం కూడా లేదని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

జ‌న‌గ‌ణ‌న‌లో కులగణన

రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు కులగణనను తమ విజయంగా చెప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణనకు ఒప్పుకునేలా చేయడంలో తాము విజయం సాధించామని కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీ నాయకులు అంటున్నారు. బీహార్‌లో కుల గణన జరగడానికీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన చేయ‌డానికి కేంద్రం ముందుకు రావ‌డానికి తమ పోరాట ఫ‌లిత‌మేన‌ని ప్రతిపక్ష పార్టీలు చెప్పుకుంటున్నాయి. అయితే.. అందులో కొంత నిజం ఉన్నా, మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతిపక్షాల అమ్ముల‌ పొదిలోని ప్రధాన అస్త్రాన్ని నిర్వీర్యం చేసిన‌ట్ల‌యింద‌ని దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది.

క్రెడిట్ ఎవ‌రికి అనేది తేల్చ‌నున్న‌ బీహార్ ఎన్నిక‌లు?

ఈ సంవత్సరం చివర‌లో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ సారధ్యంలోని మహా ఘడ్ బంధన్ ఆశలపై కుల‌గ‌ణ‌న ప్ర‌క‌ట‌న వారి ఆశ‌ల‌పై నీల్లు కుమ్మరించిన‌ట్ల‌యింద‌ని అంటున్నారు. అయితే.. మహా ఘడ్ బంధన్ భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్, ఆర్జేడీ మోడీ మెడలు వంచి కులగణన తెచ్చామనీ.. అదే తమ ఎన్నికల ప్రచార అస్త్రం అవుతుందని మ‌రికొంద‌రు అంటున్నారు. ఏది ఏమ‌యినా కులగణనకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలే రెండు కూట‌ముల‌కు మొద‌టి టెస్ట్ అవుతుంద‌ని అంటున్నారు. కులగణన క్రెడిట్ ఎవరికి ద‌క్కుతుంద‌నేది కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిర్ణ‌యిస్తాయ‌ని.. అంతవరకు అది త‌మ క్రెడిట్ అని రెండు కూట‌ములు పైచేయి సాధించాల‌ని చూస్తూనే ఉంటాయిని పొలిటిక‌ల్ అనిలిస్టులు వ్వాఖ్యానిస్తున్నారు.

Share the post