తెలంగాణలో మోడీ పర్యటన ఉంటుందనే హింట్ ఇచ్చారు. కానీ అట్లాంటి వాతావరణం కన్పించట్లేదు. ప్రధాని మోడీ టూర్ ఉన్నట్టా? లేనట్టా? కేరళ, తమిళనాడు ఎన్నికల ప్రచారం వేళ హైదరాబాద్ కు వస్తారన్న ప్రచారం ఉత్తదేనా? తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఢిల్లీ కోటకు చేరి…ఓటు బ్యాంకు ముప్పై ఐదు శాతానికి పెరిగినా..తెలంగాణకి రావడానికి దేశ ప్రభుత్వాదినేతకు మనసు రావడం రాలేదా..? హ్యాట్రిక్ విజయం తర్వాత ప్రధాని మోదీ అసలు తెలంగాణ వైపు కన్నెత్తి చూడకపోవడానికి కారణాలేంటి..? ఇది వ్యూహాత్మక మౌనమా ? లేక రాష్ట్ర నేతల మధ్య సాగుతున్న కోల్డ్ వారా..? లేక కేవలం అసంపూర్తి ప్రాజెక్టులే అడ్డంకిగా మారాయా..? లేక అంతర్గత కుమ్ములాటలే ప్రధానిని దూరం పెడుతున్నాయా..?
తెలంగాణలో అధికార పీఠం కోసం చాలా కాలంగా కాషాయ పార్టీ ఎదురుచూస్తూ ఉవ్విళ్లూరుతోంది…అధికార పీఠమే లక్ష్యంగా తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది… దానిలో భాగంగానే కేరళ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ వచ్చిన సమయంలో తెలంగాణలో కూడా పర్యటన ఉంటుంది అంటూ హింట్ ఇచ్చారు నేతలు. దీంతో ప్రధాని మోదీ పర్యటనపై బీజేపీ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కేరళ ఎన్నికలే ముగిసాయి కానీ ప్రధాని రాలేదు.. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా సందర్భాల్లో ప్రధాని మోడీ పర్యటన ఉంటుందని భావించినా.. వాయిదా పడుతూనే వస్తుంది.
తాజాగా కేరళ, తమిళనాడు ఎన్నికల సమయంలోనే రాష్ట్రానికి రావాలని ప్రధాని భావించినా.. అనివార్య కారణాలతో ఆ పర్యటన రద్దు అయిందనే ప్రచారం జరుగుతోంది.. దానికి ప్రధాన కారణం చేతిలో బలమైన అభివృద్ధి అస్త్రం లేకపోవడమనే ప్రచారం.. పదేళ్లు గడుస్తున్నా బీబీనగర్ ఎయిమ్స్ పనులు అసంపూర్తిగానే ఉండటం, అటు ములుగు గిరిజన విశ్వవిద్యాలయం కాగితాలు దాటి క్షేత్రస్థాయిలోకి రాలేకపోవడం, ఇక వరంగల్ మామ్నూర్ విమానాశ్రయానికి సాంకేతిక చిక్కులు, రీజినల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ లొల్లి అడ్డంకిగా మారాయనే ప్రచారం నడుస్తోంది. అభివృద్ధి పనులు పూర్తయ్యాకే రావాలన్నది ప్రధాని ఆలోచనగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో అభివృద్ధి పనులు ఒక ఎత్తు అయితే..గత కొంత కాలంగా రాష్ట్ర బీజేపీ నేతల మధ్య కొనసాగుతున్న అంతర్గత యుద్ధం మరో ఎత్తు.. తెలంగాణలో పార్టీ బలపడిందని సంతోషించాలో! లేక నేతల మధ్య పెరుగుతున్న దూరాన్ని చూసి బాధపడాలో తెలియని స్థితిలో ఉంది బీజేపీ అధిష్టానం.. ఢిల్లీ నుంచి చూస్తే అంతా ఒక్కటే అన్నట్లు కనిపిస్తున్నా..లోపల మాత్రం గ్రూపు రాజకీయాలు తారాస్థాయిలో ఉన్నాయనే చర్చ లేకపోలేదు.. ఒకవైపు పాత నేతలు, మరోవైపు కొత్తగా వచ్చిన నేతలు అన్నట్లుగా ఆధిపత్య పోరు సాగుతోందటా.. నేతల మధ్య సమన్వయం వచ్చిన తర్వాతే తెలంగాణలో ఎంట్రీ ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్టు పార్టీ ఆఫీసులో గుసగుసలాడుకుంటున్నారట.
మరి రాష్ట్ర పార్టీలో కీలక నేతల మధ్యనే అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరడంతో రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు కి తలనొప్పి గా మారిందనే చర్చ జరుగుతోంది. జాతీయ పెద్దలు ఈ విభేదాల్లో కలుగ చేసుకోకపోతే నేతల మధ్య దూరం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.? ఇకా అస్సాం, పుదుచ్చేరి, కేరళ ఎన్నికలు ముగిసాయి. మిగిలింది కేవలం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మాత్రమే. బెంగాల్ ఎన్నికల్లో ప్రధాని బిజీ బిజీగా ప్రచారాన్ని హోరేత్తిస్తున్నారు.ఈసారి ఎలాగైనా బెంగాల్ లో కాషాయ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఒకవైపు మోదీ, మరోవైపు ఏకంగా అమిత్ షా బెంగాల్ లోనే 15రోజుల మకాం వేశారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రధాని మోడీ పర్యటన ఇప్పట్లో లేనట్లేనన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల ముందు హైదరాబాద్ లో ప్రధాని మోడీ తో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావించింది.. ప్రధాని మోదీ వస్తే.. ప్రధానితో తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు ఇచ్చిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు,వివిధ ప్రాజెక్టులతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే నిధులపై చెప్పించాలని భావించారు. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని భావించిందట బీజేపీ.. ఇప్పుడు ప్రధాని మోడీ వచ్చి నిధులపై హామీలు ఇస్తే.. ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి ఖాతాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వ్యూహకర్తలు హెచ్చరిస్తున్నారటా… అందుకే ఎన్నికల సమయంలో నేరుగా ఒకేసారి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేలా ప్రధాని మోదీ పర్యటనను రిజర్వ్ చేసి ఉంచినట్లు బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాషాయపార్టీకి గ్రౌండ్ లెవల్లో ప్రజల్లోకి వెళ్లాలంటే జాతీయ నాయకుల పర్యటనలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలనే చర్చ జరుగుతోంది
మొత్తంగా తెలంగాణలో అటు ప్రాజెక్టులు పూర్తి కావాలి.. ఇటు నేతల మధ్య ఉన్న విభేదాలు తగ్గాలి. ఈ రెండు కలిస్తేనే తెలంగాణ గడ్డపై మోదీ అడుగు పడే అవకాశం ఉందనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. మరి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్ట్ లు పూర్తయ్యేదెప్పుడు..? నేతలు కలిసేదెప్పుడు..? దీంతో తెలంగాణ కు మోదీ వచ్చేదెప్పుడు.? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనప్పటికీ వచ్చే గ్రేటర్ ఎన్నికల ముందు తెలంగాణలో ప్రధాని టూర్ ఉంటుందా? లేదా అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
#pmModi #Moditour #Moditelanganatour #BJP #BJPtelangana #GHMC #GHMCelections










