అధికార కాంగ్రెస్‌లో పదవుల పందేరం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కష్టకాలంలో జెండా మోసిన వారికి, క్షేత్రస్థాయిలో పోరాడిన వారికే పట్టం కడుతున్నారా? అంటే.. గాంధీ భవన్ వర్గాల నుంచి వస్తున్న సమాధానం మాత్రం నెగిటివ్‌గానే ఉంది. అసలైన కాంగ్రెస్ వాదికి నిబంధనలు అడ్డంకి.. వలస వచ్చిన వారికి త్యాగాల పేరుతో పదవుల పండగ’ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పదవుల పందేరంలో కొందరికే వరించిన పదవులు
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు, నిబద్ధత గల కార్యకర్తలకు గుర్తింపు దక్కడం లేదనే చర్చ జోరుగా సాగుతోంది. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాఠీదెబ్బలు తిని, కేసులు ఎదుర్కొన్న నాయకులను పక్కన పెట్టేస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. బాల్మూర్ వెంకట్, అనిల్ కుమార్ యాదవ్ వంటి యువనేతలకు పదవులు ఇస్తే సరిపోతుందా? పోరాడింది వీరు మాత్రమేనా? పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ఇతరుల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. తమ త్యాగాలకు విలువే లేదా అని సీనియర్లు బహిరంగంగానే వాపోతున్నారు. ముఖ్యంగా కొత్తగా వచ్చిన వారికి ‘sacrifise’ కోటాలో పదవులు ఇవ్వడంపై పాత కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అసంతృప్త నేతలు ప్రధానంగా కొన్ని ఉదాహరణలను కూడా చూపిస్తున్నారు. మాజీ ఎంపీ విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఏ ప్రాతిపదికన ఇచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి, ఆ పార్టీనే బీఆర్ఎస్ను ఎదుర్కోగలదని చెప్పిన ఆమె, ఎన్నికల ముందు మళ్లీ హస్తం గూటికి చేరారు. పార్టీ కండిషన్లు ఆమెకు వర్తించలేదా? 2025లో ఆమెకు ఎమ్మెల్సీ దక్కింది. పదవి వచ్చాక ఆమె పార్టీ కోసం ఎంతవరకు గళమెత్తుతున్నారు? గాంధీ భవన్‌కు ఎన్నిసార్లు వచ్చారు? ప్రత్యర్థి పార్టీలపై సోషల్ మీడియాలో రెండు, మూడు ట్వీట్లు తప్ప క్షేత్రస్థాయిలో ఆమె పాత్ర ఏముందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
విజయశాంతి అంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేశారని కొందరు సర్దుకుపోవచ్చు. కానీ, కేకే (కె. కేశవరావు) వ్యవహారంపై మరింత చర్చ జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన, ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ వైపు వెళ్లారు. పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించి, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ సొంత గూటికి చేరారు. చేరిన వెంటనే ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. పోనీ కేకే సీనియర్ అనుకుందాం.. ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి విషయంలో పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఆమెకు త్వరలో మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పార్టీ కోసం ఏం చేశారని ఆమెకు పదవులు ఇస్తున్నారని మహిళా నేతలు ఆవేదన చెందుతున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి.
అయితే, గద్వాల విజయలక్ష్మికి పదవి ఇవ్వడానికి అర్హత ఏంటనే చర్చ నడుస్తుంది. కేకే తన రాజ్యసభ పదవిని వదులుకోవడం, అలాగే మేయర్ హోదాలో ఆమె ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం త్యాగాలుగా పరిగణించి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి కట్టబెడుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై మహిళా కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీ నిబంధనలు కేవలం కష్టపడే వారికేనా? వలస వచ్చే వారికి ఏ నిబంధనలు ఉండవా? అని ప్రశ్నిస్తున్నారు.
Also Read..| రెండు రాజ్యసభ స్థానాలు.. ఎంపిక కాంగ్రెస్ కు కత్తిమీద సామేనా?
వీరితో పాటు ఇందిరా శోభన్, రవళి రెడ్డి, సునీత రావు వంటి మహిళా నేతలు కూడా పదవుల రేసులో ఉన్నప్పటికీ వారికి ప్రతిసారీ నిరాశే ఎదురవుతోందట. మాజీ చైర్మన్ నేరెళ్ల శారద వంటి సీనియర్ల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉందట. అటు రమ్య రావుతో పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు వినిపించిన మానవతా రాయ్, దుర్గం భాస్కర్, చరణ్ కౌశిక్ యాదవ్ వంటి యువ నాయకులు కూడా తగిన గుర్తింపు లేక నిరుత్సాహంలో ఉన్నట్లు గాందీభవన్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలపైనైనా పార్టీ పాత వారికి ప్రాధాన్యత ఇస్తుందో లేదో చూడాలి. కేవలం ఇమేజ్ చూసి కాకుండా, కష్టకాలంలో జెండా పట్టిన వారికి, పార్టీ వాయిస్ బలంగా వినిపించే వారికి పదవులు ఇస్తేనే క్యాడర్లో ఉత్సాహం వస్తుందనేది మెజారిటీ నాయకుల అభిప్రాయం.









