ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపేరు వ్యవహారంలో అనర్హతకు గురైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ కేసులో గుజరాత్ కోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. రాహుల్ పై లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు విధించడానికి గల కారణాలను క్రింది కోర్టు న్యాయమూర్తి వెల్లడించలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఫైనల్ తీర్పు పెండింగ్‌లో ఉన్నందున దోషిగా నిర్ధారించే వరకు రాహుల్ పై జారీ చేసిన క్రిమినల్ పరువు నష్టం దావా ఉత్తర్వులను నిలిపి వేస్తున్నట్లు ఆదేశించింది. ఈ తీర్పుతో రాహుల్ గాంధీ తిరిగి మళ్లీ లోక్‌సభలో అడుగు పెడతారని పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలోనే రాహుల్ సభలో ఎంట్రీ ఇవ్వబోతోన్నారని తెలుస్తోంది. ఈ తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది.
ఏమిటి కేసు ?
కర్ణాటకలోని కోలార్‌లో 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. దేశంలోని బ్యాంకులను మోసగించి.. విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుల పేర్ల చివర మోడీ అని ఎందుకు ఉంటుంది.. అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ నేతలు కోర్టులో కేసు వేశారు.
ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ప్రసంగించేటప్పుడు సంయమనంతో ఉండాలని సుప్రీంకోర్టు రాహుల్ కు సూచించింది. అవతలి వ్యక్తిని కించపరిచే పదాలని వాడడం మంచిది కాదని హితవు పలికింది. క్రిమినల్ డిఫమేషన్ కేసులో గరిష్ఠంగా శిక్షను విధించడానికి గల సంతృప్తికర కారణాలను క్రింది కోర్టు వెల్లడించలేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రాహుల్ కు ఎంపీగా కొనసాగే హక్కు ఉందని, క్రింది కోర్టు ఇచ్చిన తీర్పు ఆయనను ఎన్నుకున్న ఓటర్ల హక్కును కూడా ప్రభావితం చేసేదిగా ఉందని భావిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు మధ్యంతర స్టే విధించింది.
'असत्य पर सत्य की जीत हुई'
— Congress (@INCIndia) August 4, 2023
जय कांग्रेस, विजय कांग्रेस pic.twitter.com/yw0gXtdWE2