ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సిట్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. శుక్రవారం కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన సిట్ అధికారులు, ఆయన ఫోన్ ట్యాప్ అయినట్లు వెల్లడించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
కేంద్రమంత్రి బండి సంజయ్‌కు సిట్ నోటీసులు
సిట్ అధికారులు కేంద్ర మంత్రిని విచారణకు సిద్ధంగా ఉండాలని కోరారు. తన వాంగ్మూలం తీసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరారు. షెడ్యూల్ చూసుకుని సమయం చెబుతానని బండి సంజయ్ అధికారులకు తెలిపారు. రేపో, మాపో అధికారికంగా నోటీసులు జారీ చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
గతంలో బండి సంజయ్ ఆరోపణలు..
గతంలో కేసీఆర్ పాలనలో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని మొదట తెర పైకి తీసుకొచ్చిన నేత బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించిన సంజయ్, తన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది, ప్రధాన అనుచరుల ఫోన్లనూ ట్యాప్ చేశారని పలు మార్లు ఆరోపించారు. బీజేపీ కార్యక్రమాలను భగ్నం చేసేందుకు తనతో పాటు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లనూ గత ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని అన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సిట్ నోటీసులు ఇవ్వడానికి కారణం ఇదే..
ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం తెలుసుకుని అర్ధరాత్రి తన నివాసంపై దాడి చేసి టెన్త్ పేపర్ లీక్ పేరుతో అరెస్ట్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. అలాగే, కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో 317 జీవో సవరణ దీక్ష జరగకుండా అడ్డుకునేందుకు పోలీసులు శత విధాలా ప్రయత్నించి భంగపడ్డారని గుర్తు చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఫోన్ ట్యాప్ చేసి తనను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని పలు మార్లు సభల్లో, మీడియా వేదికల ద్వారా బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. భార్యాభర్తల సంభాషణలను కూడా ట్యాప్ చేసి, గత ప్రభుత్వం నీచానికి ఒడిగట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read..| India vs England: సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్
బండి సంజయ్ చెప్పిందంతా నిజమేనని సిట్ వర్గాలు నిర్ధారించాయి. వందలాది మంది ఫోన్లు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో, బండి సంజయ్‌ను సాక్షిగా పరిగణించి ఆయన వాంగ్మూలం తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. బండి సంజయ్ వాంగ్మూలంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది.