కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీపై మహారాష్ట్రలోని ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ. 11 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఇటీవల అమెరికా పర్యటనలో ఓ సమావేశంలో రిజర్వేషన్లను పూర్తిగా అంతం చేయాలని రాహుల్ వ్యాఖ్యానించారని.. రిజర్వేషన్ల పట్ల ఆయన చిత్తశుద్ధికి ఆవ్యాఖ్యలే నిదర్శనమని, అందుకే ఆయన నాలుక కోసిన వారికి నజరానా ప్రకటించానని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాహుల్ అసత్యాలు ప్రచారం చేశాడని, అయితే ఇప్పుడు ఆయన నిజస్వరూపం బయట పడిందని అన్నారు. మరోవైపు శివసేన ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎమ్మెల్యేపై బూల్దానా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.