ప్రతీ ఏడాది వివిధ రంగాల్లో వేలాది మందికి శిక్షణ ఇస్తూ.. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు సెట్విన్ (SETWIN) దోహదం చేస్తుందని సెట్విన్ దిల్‍సుఖ్‍నగర్ చైతన్యపురి కో ఆర్డినేటర్ అనంత సతీష్ తెలిపారు. విద్యార్ధులు ఉన్నత చదువులు చదువుకునేందుకు, అలాగే నైపుణ్యం లేని వారికి వారి వారి రంగాల్లో పట్టు సాధించేందుకు సెట్విన్ సంస్థ అండగా నిలబడతుందని ఆయన తెలిపారు.

Also Read.. | డెడికేటెడ్ కమీషన్ చైర్మెన్ బాధ్యతల స్వీకరణ
చాలామంది పేద, మధ్యతరగతి యువతకు వారి కాళ్లపై వారు నిలబడి కుటుంబానికి అండగా ఉండే విధంగా సంస్థ పనిచేస్తుంది. కేవలం నామమాత్రపు ఫీజులతోనే వారు కోరుకున్న కోర్సులను అందిస్తుంది. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా SETWIN ముందుకు సాగుతోంది. ఈ సంస్థ దాదాపు 60కిపైగా వివిధ కోర్సులను అందిస్తుంది. కొంతమంది ఫీజు కూడా కట్టలేని నిరుపేదలకు కొంతమంది NGOల సాయంతో ఫీజుకూడా సంస్థవారే సమకూర్చి కోర్సులను అందిస్తున్నారు.

సెట్విన్ అంటే..?
SETWIN అంటే సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్ (SOCIETY FOR EMPLOYMENT PROMOTION AND TRAINING IN TWIN CITIES). ఇది ఒక ప్రభుత్వ సంస్థ. ఇది 1978 సం.లో ప్రారంభమైంది. మొదటగా జంటనగరాలకే పరిమితం అయిన సంస్థ, ఇప్పుడు ట్విన్ సిటీస్‌ను దాటి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా సెంటర్లలో సేవలను అందిస్తుంది. మరో నాలుగు సెంటర్లలో కొత్తగా శిక్షణా కేంద్రాలను ప్రారంభిస్తుంది. ఈ సంస్థ మహిళలకు, నిరుద్యోగులకు, యువతకు మెరుగైన శిక్షణ కల్పిస్తూ స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తోంది.

సెట్విన్ లో 60 కి పైగా కోర్సులు
సెట్విన్ సంస్థ 60కి పైగా వివిధ కోర్సులలో శిక్షణ ఇస్తుంది. MS- Office, PGDCA, మల్టీమీడియా, నెట్వర్కింగ్, కంప్యూటర్ లాంగ్వేజెస్ లాంటి కోర్సులలో ట్రైనింగ్ ఇస్తారు. అభ్యర్థులు ఎంచుకున్న కోర్సును బట్టి 3నెలల నుంచి సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. ఈ కోర్సుల ఫీజు రూ.1500 నుంచి రూ. 6 వేల లోపే ఉంటుంది. ఇవే కాకుండా మొబైల్ రిపేరింగ్, సోలార్ టెక్నీషియన్స్, డీజిల్ మెకానిక్, సీసీ టీవీ, ఆటో ఎలక్ట్రీషియన్ లాంటి వాటిలో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ 20% క్లాస్ రూం థియరీలో, 80 % ప్రాక్టికల్స్ తో విద్యార్ధులకు కోర్సులు నేర్పిస్తారు.

మహిళల కోసం ప్రత్యేక కోర్సులు
విద్యార్థినులకు, మహిళలకు విభిన్న రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సంస్థ పనిచేస్తోంది. కంప్యూటర్ కోర్సులే కాకుండా బ్యూటీషియన్, మెహిందీ డిజైన్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, టెక్స్‌టైల్ డిజైనింగ్, గార్మెంట్ మేకింగ్, కుట్టు మిషన్ వంటి రంగాల్లో మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఏ కోర్సు అయినా దాదాపు రూ. 3 వేలకు మించి ఫీజు లేదు. ఇవికాకుండా ఎడ్యుకేషన్ రంగానికి సంబందించిన కోర్సులను కూడా సెట్విన్ అందిస్తుంది. ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, కాలీగ్రఫీ, స్పోకెన్ ఇంగ్లీష్, గార్మెంట్ మేకింగ్ కోర్సులను అందిస్తుంది. ఉదయం 8 గం. నుండి రాత్రి 8 గం. వరకు క్లాసులు నిర్వహిస్తోంది.

పేదరిక నిర్మూలనే లక్ష్యం
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సంస్థ పని చేస్తుందని దిల్‍సుఖ్‍నగర్ చైతన్యపురి కో ఆర్డినేటర్ అనంత సతీష్ తెలిపారు సెట్విన్‌లో శిక్షణ పొందేందుకు ఇతర జిల్లాల నుండు కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి కూడా విద్యార్థులు వస్తున్నారని అన్నారు. తమవద్ద శిక్షణ పొందిన వారు SETWIN సర్టిఫికెట్‌తో గల్ఫ్ దేశాలలోనూ ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. ఆసక్తి కలవారు 80191 92515 నెంబర్ లో తమను సంప్రదించవచ్చని తెలిపారు.