హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) లో సర్వమత ప్రార్థనల నడుమ ఆయన బాధ్యతలను చేపట్టారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సజ్జనర్ కీలక అంశాలను వెల్లడించారు. నగరంలో ‘పీపుల్ వెల్పేర్ పోలీసింగ్’ విధానానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, ఇది నగర ప్రజల భద్రతకు ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎటువంటి రాజీపడబోమని ఆయన ప్రకటించారు.
పీపుల్ వెల్పేర్ పోలీసింగ్‌లో భాగంగా తాము దృష్టి సారించే అంశాలను సీపీ సజ్జనర్ వివరించారు. నగర యువత భవిష్యత్‌ను నాశనం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపుతామని సీపీ సజ్జనర్ హెచ్చరించారు. గతంలో నమోదైన డ్రగ్స్ కేసులను పునఃపరిశీలించి, మూలాల్లోకి వెళ్లి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ‘హెచ్ న్యూ’ బృందాన్ని మరింత బలోపేతం చేసి, ‘సే నో టు డ్రగ్స్’ ప్రచారం తరహాలో డ్రగ్స్‌పై విస్తృత అవగాహన కల్పిస్తామని తెలిపారు.
సైబర్ క్రైమ్స్ బారిన ఎక్కువగా వృద్ధులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, డిజిటల్ అరెస్ట్, స్టాక్ మార్కెట్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై కాలనీలు, అపార్ట్‌మెంట్లు, బస్తీలతో పాటు అన్ని వర్గాల వారికి అవగాహణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
నగరంలో రోజురోజుకు జటిలమవుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుంటామని సీపీ వెల్లడించారు. రోడ్లపై ప్రజల సమయాన్ని ఆదా చేయడమే లక్ష్యమన్నారు. ముఖ్యంగా, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారు రోడ్లపై తిరిగే సూసైడ్ బాంబుల వంటివారు అంటూ వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని కఠినంగా హెచ్చరించారు.
అలాగే, ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పుగా మారిన కల్తీ ఆహారం అంశంపై లోతుగా దృష్టి సారించి, కల్తీ ముఠాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఆడపిల్లలు, చిన్నారులపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే హైదరాబాద్ పోలీసుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, ఉత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి రివార్డులు అందజేస్తామని సీపీ సజ్జనర్ తెలిపారు. మతసామరస్యం ఉన్న హైదరాబాద్ నగరంలో అందరూ కలిసిమెలిసి ఉంటున్నారన్నారు. ఈ నగర ప్రత్యేక చరిత్రను, గంగా యమున తెహజీబ్ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.









