ప్రముఖ భారత పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) (Ratan Tata) తుదిశ్వాస విడిచారు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. వృద్ధాప్య సమస్యల కారణంగా కొంత కాలంగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం రాత్రి మరణించారు. ఆయన మరణం భారతదేశానికి తీరని లోటని ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు, దేశప్రజలు నివాళులు అర్పించారు. రతన్ టాటా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు.
భారతదేశంలో అత్యంత ప్రముఖ పారిశ్రామికవేత్తలలో రతన్ టాటా ఒకరుగా పేరు సంపాదించారు. ఆయన నాయకత్వంలోనే టాటా గ్రూప్ అనేక విజయాలను సాధించింది. రతన్ టాటాకు 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008 లో పద్మవిభూషణ్ అవార్డులు వరించాయి. తన ఆదాయంలో సగానికిపైగా సేవా కార్యక్రమాలకే ఆయన వినియోగించేవారు. కరోనా సమయంలో ఆయన మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రూ. 1,500 కోట్లను ప్రభుత్వానికి అందించారు. ఆయన ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు.
వ్యాపారంలో నైతిక విలువలు పాటించాలని ఆయన దృఢంగా నమ్మేవాడు. సామాజిక బాధ్యతతో ఉండేవారు. రతన్ టాటా సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని తమ కంపెనీల ఆవిష్కరణలను చేసేవారు. పేదవారికి తక్కువ ధరకు కారును అందించే విధంగా లక్ష రూపాయలకే నానో కారును తీసుకువచ్చారు. ముంబాయి తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు అందులో పనిచేసిన సిబ్బందికి, బాధితులకు అండగా నిలిచి ఆదుకున్నాడు. ఉప్పు నుండి విమానాల వరకు అనేక వ్యాపారాల్లో టాటా తన విశిష్టతను చాటుకుంది. రతన్ టాటా చేసే వ్యాపారంలో నీతి నిబద్ధతకు పెద్దపీట వేసేవారు. ఆయన వ్యాపారాన్ని నడిపించిన తీరు, ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.