ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో ఆయన శనివారం సమావేశమయ్యారు.
ఒక్కో మండలం వారీగా నాయకులతో సమావేశమైన మంత్రి పొంగులేటి, ఎన్నికల సన్నద్ధతపై కీలక దిశానిర్దేశం చేశారు. రేపటి కేబినెట్ సమావేశంలో ఎన్నికల తేదీపై చర్చించి స్పష్టత ఇస్తామని ఆయన వెల్లడించారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని, అవి పూర్తయిన వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించబడతాయని తెలిపారు.
Also Read…| KCR: కేసీఆర్ కాళేశ్వరం కమీషన్ విచారణకు హాజరు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని సూచించారు. నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఎన్నికలకు రావడానికి కేవలం 15 రోజుల గడువు మాత్రమే ఉందని గుర్తుచేస్తూ, నాయకులు తమ గ్రామాల్లోని చిన్న చిన్న లోటుపాట్లను సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల దరిచేర్చడం జరిగిందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాబోయే వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ కుంట మొదలుకొని ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే అని ఆయన పేర్కొన్నారు. తమ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాకుండా, వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా నాయకులే చూసుకోవాలని మంత్రి సూచించారు.