మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమీషన్ విచారణకు హాజరయ్యారు. బుధవారం ఉదయం బీఆర్కే భవన్‌లో దాదాపు 50 నిమిషాల పాటు ఈ విచారణ కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజర్యారు.కమీషన్ ఆయనను 50 నిమిషాల పాటు ప్రశ్నించింది..
కేసీఆర్ కాళేశ్వరం కమీషన్ విచారణకు హాజరు
ఉదయం 9:30 గంటలకు ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్ నుంచి బయలుదేరిన కేసీఆర్, 11 గంటలకు బీఆర్కే భవన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరావడంతో బీఆర్కే భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్‌తో పాటు 9 మంది సీనియర్ బీఆర్ఎస్ నాయకులను కూడా లోపలికి అనుమతించారు.

కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్, నోడల్ అధికారులు శ్రీనివాస్, విజయ భాస్కర్ రెడ్డి సమక్షంలో కేసీఆర్ విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు రీ-ఇంజనీరింగ్, ప్రాజెక్టు నిర్మాణం, నిధుల వినియోగం, కార్పొరేషన్ ఏర్పాటు, నీటి లభ్యత, ఒప్పందాలు తదితర అంశాలపై కమిషన్ కేసీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను, రీ-ఇంజనీరింగ్ అవసరాన్ని, అనుసరించిన విధానాలు, పొందిన అనుమతులు తదితర వివరాలను కమిషన్ కు వివరించారు. పలు కీలక పత్రాలు, పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను కూడా కమిషన్ కు సమర్పించారు.
Also Read..| ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ.. గంజాయి కలకలం
తనకు స్వల్పంగా జలుబు ఉన్నందున విచారణను “ఇన్ కెమెరా” పద్ధతిలో నిర్వహించాలని కేసీఆర్ కోరగా, కమిషన్ అందుకు అంగీకరించింది. దీంతో మీడియా, ఇతరులు లేకుండానే విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ఎదుర్కొన్న 115వ సాక్షిగా కేసీఆర్ నిలిచారు. గతంలో ఈ కమిషన్ మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ లను కూడా విచారించింది.

విచారణ అనంతరం కేసీఆర్ బీఆర్కే భవన్ నుంచి బయలుదేరి, అక్కడ వేచి ఉన్న పార్టీ కార్యకర్తలకు అభివాదం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో లీకేజీలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ తో ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం, అమలులో భాగస్వామ్యులైన పలువురు అధికారులను, నిపుణులను ఇప్పటికే కమిషన్ ప్రశ్నించింది. కమీషన్ గడువు జూలై 31 వరకు ఉంది. ఈ లోపు కమీషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం కనబడుతోంది.