లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ నేటి ఉదయం ప్రారంభమైంది.. ఈ విడతలో 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ను నిర్వహించనున్నారు. వాస్తావానికి 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా 88 స్థానాల్లోనే పోలింగ్ జరుగుతోంది. ఎందుకంటే.. మధ్య ప్రదేశ్ లోని బేతుల్ స్థానం నుంచి బరిలోకి దిగిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి అశోక్ భలవి ఏప్రిల్ 9న చనిపోయారు. దీంతో, అక్కడ జరగాల్సిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశకు మే 7వ తేదీకి వాయిదా వేసింది. ఎండలు, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున బీహార్ లోని పలు స్థానాల పరిధిలో పోలింగ్ సమయాన్ని పెంచుతున్నట్టు ఈసీ తెలిపింది. బంకా, ఖగారియా, ముంగేర్, మాధేపురా స్థానాల పరిధి లోని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని తొలుత భావించారు. అయితే, ఎండల కారణంగా ఓటర్ల సౌకర్యం కోసం ఆయా చోట్ల పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. ముంగేర్ లోని 230 పోలింగ్ స్టేషన్లు, ఖగేరియా లోని 299, మాధేపురా లోని 207, బంకా లోని 363 పోలింగ్ స్టేషన్లలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.