ఇవాళ తొలి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలి దశ కింద 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలో మొత్తం 1600 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా 16 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించ నున్నారు. ఓటింగ్ కోసం లక్షా 87 వేల పోలింగ్ కేంద్రాల్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.. తొలి దశలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 మంది మహిళలు, 11,371 ఇతరులు తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జూన్ 1వ తేదీన ముగియనుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు కేంద్ర బలగాలను మోహరించింది.
లోక్ సభ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడులో 39 సీట్లు, ఉత్తరాఖండ్ లో 5 సీట్లు ఉండగా.. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ లో 2 సీట్ల చొప్పున ఉన్నాయి. అండమాన్ అండ్ నికోబార్, మిజోరం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, లక్షద్వీప్ లో ఒక్కో సీటు చొప్పున ఉన్నాయి. ఈ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఫస్ట్ ఫేజ్ లోనే ఎన్నికలు ముగియనున్నాయి.